Mohan Babu: ఈ మధ్య మంచు మోహన్ బాబు వివాదాలతోనే బాగా ఫేమస్ అవుతున్నాడు. గత కొన్నిరోజులుగా మంచు వారసులు ఆస్తి తగాదాలతో రోడ్డుపై కొట్టుకుంటున్న విషయం తెల్సిందే. ఇక మోహన్ బాబు సైతం జర్నలిస్ట్ ను మైక్ తో కొట్టి.. పోలీస్ కేసులో కూడా ఇరుక్కున్నాడు. ఇక ఈ కేసు నుంచి మోహన్ బాబు బయటపడిన విషయం కూడా తెల్సిందే. ప్రస్తుతం మంచు కుటుంబం సద్దుమణిగింది.
ఇక ఈలోపే మంచు మోహన్ బాబుపై మరో ఆరోపణ వచ్చింది. దివంగత నటి సౌందర్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం కలబోసిన రూపం ఆమె సొంతం. సావిత్రి తరువాత అంతటి ప్రజాదరణ పొందిన నటి అంటే సౌందర్యనే అని చెప్పొచ్చు. అలాంటి సౌందర్య.. అతి చిన్న వయస్సులోనే ఫ్లైట్ క్రాష్ లో మృత్యువాత పడింది. దాదాపు ఆమె మృతి చెంది ఈ ఏడాదికి 21 ఏళ్లు కావొస్తున్నాయి.
అయితే 21 ఏళ్ల తరువాత సౌందర్యది హత్య అని ఒక వ్యక్తి పోలీసుల వద్దకు రావడం సంచలనంగా మారింది. ఖమ్మం జిల్లా సత్యనారాయణ పురంకు చెందిన ఎదురుగుట్ల చిట్టిబాబు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో ఆయన మోహన్ బాబే.. సౌందర్యను హత్య చేసినట్లు తెలిపాడు. కేవలం ఆమె ఆస్తిని కబ్జా చేయడానికి అడ్డు వస్తుందని సౌందర్యను, ఆమె అన్నను చంపించినట్లు చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం మోహన్ బాబు నివాసముంటున్న జల్ పల్లిలో ఉన్న ఫార్మ్ హౌస్.. ఒకప్పుడు సౌందర్యది. దాన్ని అమ్మాలని ఎన్నోసార్లు మోహన్ బాబు.. సౌందర్య అన్నను అడిగాడట. అతను దానికి ఒప్పుకోలేదట. ఆ ఫిర్యాదులో చిట్టిబాబు ఏం చెప్పాడంటే.. ” సౌందర్యను మోహన్ బాబే హత్య చేయించాడు. జల్ పల్లిలో ఉన్న ఆరు ఎకరాల ఫార్మ్ హోస్ ను అమ్మాలని అడిగితే సౌందర్య అన్న అమర్ నాథ్ దానికి నిరాకరించాడు. దీంతో కక్ష కట్టిన మోహన్ బాబు.. సౌందర్య, అమర్ నాథ్.. ప్రచారం కోసం బెంగుళూరు నుంచి తెలంగాణ వస్తున్నారని తెలుసుకోని సాక్ష్యాలు లేకుండా వారిని చంపించేశాడు. ఆ తరువాత ఆ ఇంటిని అక్రమంగా కబ్జా చేసి విలాసవంతంగా జీవిస్తున్నాడు.
వెంటనే ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అంతేకాకుండా మంచు మనోజ్ కు మోహన్ బాబు న్యాయం చేయాలి. మోహన్ బాబుపై తగిన చర్యలు తీసుకోవాలి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫిర్యాదు నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇన్నేళ్లు చిట్టిబాబు ఎక్కడ ఉన్నాడు.. ? ఎందుకు ఇప్పటివరకు ఈ నిజాన్ని బయటపెట్టలేదు. ఇందులో నిజమెంత.. ? లేకపోతే అతనితో ఎవరైనా ఇలాంటి పని చేయిస్తున్నారా.. ? అనేది తెలియాల్సి ఉంది.
మోహన్ బాబు- సౌందర్యది చాలా హిట్ కాంబినేషన్. పోస్ట్ మ్యాన్, పెదరాయుడు మొదలుకొని శివ శంకర్ వరకు ఎన్నో సినిమాల్లో ఈ జంట కలిసి నటించారు. ఎప్పుడు సౌందర్య గురించి మాట్లాడినా మోహన్ బాబు ఆమెతో నటించడం ఎంతో అద్భుతమని, ఆమె లేని లోటు టాలీవుడ్ లో కనిపిస్తుందని చెప్పుకొచ్చేవాడు. మరి ఈ ఫిర్యాదుపై మోహన్ బాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.