Site icon Prime9

Group1 Results: ముగిసిన మెయిన్స్ మూల్యాంకనం.. పది రోజుల్లో గ్రూప్ 1 ఫలితాలు

TGPSC Groups 1 Results 2025: తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం విజయవంతంగా ముగిసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలనను కొనసాగిస్తోంది. వారం, పది రోజుల్లో గ్రూప్-1 ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయి. అనంతరం ఆయా అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.

తగ్గిన పోటీ..
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 563 గ్రూప్‌ 1 సర్వీసు పోస్టులకు టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19న ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్‌ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా.. 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా, ఈసారి గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. మొత్తం ఉద్యోగాల సంఖ్య 563గా ఉంది. దీంతో ఒక్కో ఉద్యోగానికి 38 మంది పోటీపడుతున్నారు. వారిలో కేవలం 67.17శాతం మాత్రమే పరీక్ష రాశారు.

పక్కాగా పీఎస్సీ..
ఎంతో కాలంగా వాయిదా పడుతూ వచ్చిన గ్రూప్ 1 పరీక్షల విషయంలో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురైన నేపథ్యంలో వచ్చిన నోటిఫికేషన్ గనుక దీని విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది. ఈ క్రమంలో గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షల్లో 6 పేపర్లలో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరచనున్నారు. సబ్జెక్టుల వారీగా మార్కులను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేసింది. ఈ మార్కుల లెక్కింపుపై అభ్యర్థులకు సందేహాలుంటే రీకౌంటింగ్‌ ఆప్షన్‌ కల్పించనుంది. 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా వెల్లడించిన 15 రోజుల లోపు అభ్యర్థులు ఒక్కో పేపర్‌కు రూ.వెయ్యి చొప్పున చెల్లించి రీకౌంటింగ్‌ చేయించుకోవాలనుకుంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Exit mobile version
Skip to toolbar