TG SSC Exams 2025 To Start From Today In Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వార్షిక పరీక్షలు ఏప్రిల్ 4వ తేది వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2,650 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. పరీక్షలకు 5,09,403 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
కాగా, పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 2,650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 2,650 చీఫ్ సూపరింటెండెంట్లు, 2,650 డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లతో పాటు 28,100 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష రాసే విద్యార్థులు www.bse.telangana.gov.in వెబ్ సైట్ లేదా పాఠశాలలో నేరుగా హాల్ టికెట్స్ పొందే అవకాశం కల్పించారు. ఇతర వివరాలకు 040-23230942 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
ఇక, గతంలో పరీక్షా కేంద్రానికి నిమిషం నిబంధనను పాటించేవారు. కానీ ఈ ఏడాది పరీక్ష రాసే విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పిరియడ్ విధించారు. దీంతో 9.35 నిమిషాలు దాటితే పరీక్ష రాసేందుకు అనుమతి నిరాకరించనున్నారు. అలాగే విద్యార్థులు వాచ్, ఎలక్ట్రానిక్‌కు సంబంధించిన గ్యాడ్జెట్ వస్తువులను పరీక్షలోపలికి అనుమతి నిరాకరించనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని సూచించారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో పోలీస్ బందోబస్తు ఉంటుంది.
పరీక్షల విషయానికొస్తే..21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, 24న థర్డ్ లాంగ్వేజ్, 26న మ్యాథ్స్, 28న ఫిజికల్ సైన్స్, 29న బయాలజీ, ఏప్రిల్ 2న సోషల్, 3న ఒకేషనల్ కోర్స్ పేపర్ 1 లాంగ్వేజ్, 4న ఒకేషనల్ కోర్స్ పేపర్ 2 లాంగ్వేజ్ పరీక్షలు ఉండనున్నాయి. ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి పరీక్ష కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.