NEET 2023: వైద్య విద్య కలను నెరవేర్చుకోవాలంటే అభ్యర్థులు నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ NEET)లో అర్హత సాధించాలి. ఈ ప్రవేశ పరీక్ష ద్వారానే ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంతో కఠినమైన ఎంట్రెన్స్ టెస్టుల్లో ఒకటిగా నీట్‌ను పేర్కొంటారు. నీట్-2023 పరీక్ష మే 7న నిర్వహించనున్నారు. నీట్ పరీక్ష దరఖాస్తులకు గడువు ముగుస్తోంది. ఏప్రిల్ 6 తో నీట్ దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగు తో పాటు మొత్తం 13 భాషల్లో నీట్ పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు https://neet.nta.nic.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
మార్చి 6 వ తేదీ నుంచి నీట్ ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. జనరల్ క్యాటగిరీ అభ్యర్థులు రూ.1700 ఫీజ్ దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ ఎన్సీఎల్ అభ్యర్థులు రూ. 1600 , ఎస్సీ, ఎస్టీ /పీడబ్ల్యూబీడీ, థర్డ్ జండర్ అభ్యర్థులు రూ. 100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాల నుంచి కూడా ఈ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు మాత్రం దరఖాస్తుకు రూ. 9500 లు చెల్లించాలి. అడ్మిట్ కార్డుల డౌన్ లోడ్ , పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్టీఏ వెబ్ సైట్ లో వెల్లడించనున్నారు. నీట్ పరీక్ష మే 7 (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరగనుంది.
గత 5 ఏళ్లుగా నీట్ పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత ఏడాది 17.64 లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాశారు. ఈ ఏడాది ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా. నీట్ కు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధ్రువీకరణ పేజీని డౌన్ లోడ్ చేసుకోవాలి.