CBSE Exams: 2023-2024 సంవత్సరానికి గాను సీబీఎస్‌ఈ 10,12వ తరగతి పరీక్షల నిర్వహణకు తేదీలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖరారైంది. 2024 ఫిబ్రవరి 15 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సీబీఎస్ఈ పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ ప్రకటించారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కు సిద్ధమయ్యే విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ముందుగానే పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించాలని విద్యాశాఖ నిర్ణయించిందని ఆయన తెలిపారు.
మరోవైపు, ఈ ఏడాది నిర్వహించిన సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. 3.8 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు 90 శాతానికి పైగా స్కోరు సాధించారు. 66 వేల మందికి పైగా 12 వ తరగతి విద్యార్థులు 95 శాతం పైగా స్కోరు సాధించారు. విద్యార్థుల మధ్య అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు మెరిట్‌లిస్ట్‌ను ప్రకటించలేదని బోర్డు తెలిపింది. 12వ తరగతి విద్యార్థుల్లో 1,12,838 మంది 90 శాతం పైగా స్కోరు సాధించారు. 22,622 మంది విద్యార్థులు 95 శాతం పైగా మార్కులు సాధించారు. అలాగే, పదో తరగతిలో 1,95,799 మంది విద్యార్థులు 90 శాతం పైగా స్కోరు సాధించారు. 44, 297 మంది 95 శాతానికి పైగా స్కోరు సాధించినట్టు బోర్డు తెలిపింది.
ఈ ఏడాది సీబీఎస్‌ఈ 10 వ తరగతి పరీక్షలను 21,65,805 మంది విద్యార్థులు రాశారు. అందులో 20,16,779 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతా శాతం 93.12 గా నమోదైంది. గత ఏడాది ఉత్తీర్ణత శాతంతో (94.40%) పోలిస్తే ఇది 1. 28 తగ్గడం గమనార్హం. అలాగే, 12 వ తరగతి పరీక్షలను దేశ వ్యాప్తంగా 16,60,511 మంది విద్యార్థులు రాశారు. 14,50,174 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం 87.33 గా నమోదైంది. గతేడాది ఉత్తీర్ణత శాతంతో (92.71%) పోలిస్తే 5. 38 శాతం తగ్గినట్టు అధికారులు వెల్లడించారు.
కాగా, జాతీయ విద్యా విధానం చేసిన సిఫారసుల ఆధారంగా కంపార్ట్‌మెంట్ పరీక్ష అనే పేరును ‘సప్లిమెంటరీ’గా మార్చాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. బోర్డు పరీక్షల్లో విద్యార్థుల పెర్ఫామెన్స్‌ను మెరుగు పరుచుకునేందుకు అవకాశం కల్పించింది. 10 వ తరగతి విద్యార్థులు తమ మార్కులను ఇంప్రూవ్ చేసుకునేందుకు రెండు సబ్జెక్టులను సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా రాసుకొనేందుకు వెసులుబాటు కల్పించారు. అదే విధంగా 12 వ తరగతి విద్యార్థులకు ఒక సబ్జెక్టులో అవకాశం కల్పించారు. సప్లిమెంటరీ కేటగిరీ విద్యార్థులతో పాటు మార్కులను ఇంప్రూవ్ మెంట్ రాసే వారికి జులైలో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు.