Yamaraj Temple: మనలో దేవుళ్లను నమ్మేవారు చాలా మంది ఉంటారు. వారంతా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పండుగల సమయంలో దేవాలయాలకు వెళ్తుంటారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో గుడి వెళ్లే ఉంటారు. ఇలా దేవుని సన్నిధికి వెళ్లడం వల్ల దేవుడి ఆశీస్సులు, అనుగ్రహం లభిస్తాయని, తాము చేసిన పాపాల్ని దేవుడు క్షమిస్తాడని కొందరు భావిస్తుంటారు. అయితే మన దేశంలో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. చాలా ఆలయాల్లో అనేక రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. ఇదిలా ఉంటే ఒక ఆలయం లోపలికి వెళ్లేందుకు మాత్రం ఎవ్వరూ ఇష్టపడడం లేదట, అసలు ఆ గుడిలోకి ఎవరూ ఎందుకు పోరు, ఇంతకీ ఆ గుడిలో ఏ దేవుడు ఉన్నాడు. అది ఎక్కడుంది. వంటి సమాచారాన్ని ఇక్కడ చదివెయ్యండి.
హిమచల్ ప్రదేశ్ రాష్ట్రం, చంబాలోని భర్మోర్ అనే చిన్నపట్టణంలో ఒక ఆలయం ఉంది. ఇది చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది కానీ ఈ ఆలయం మహిమలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. అయినా కూడా ఈదేవాలయానికి వెళ్లడానికి భయపడతారు. ఎందుకంటే ఇది యమధర్మరాజు ఆలయం. ఎత్తైన పర్వతాల మధ్య ఉండే ఈ యమధర్మ రాజు ఆలయం ఎప్పుడు, ఎవరు, ఎలా నిర్మించారనే వివరాలు ఎవ్వరికీ స్పష్టంగా తెలీదు. కానీ చంబా రాజు ఈ ఆలయాన్ని 6వ శతాబ్దలో పునరుద్ధరించారని చరిత్ర చెప్తుంది.
మృత్యు దేవుడైన యమ ధర్మరాజుకి సంబంధించి ప్రపంచంలో ఉన్న ఏకైక ఆలయం ఇదే. ఈ ఆలయం యమ ధర్మరాజు కోసమే కట్టారని, అందుకే అతను తప్ప, ఇంకెవరూ ఈ గుడిలోకి వెళ్లలేరని అక్కడి స్థానిక ప్రజలు చెబుతారు. అయితే జానపద విశ్వాసాల ప్రకారం, ఎవరైతే వ్యక్తులు ఎలాంటి భయం లేకుండా యమ దేవుడిని పూజిస్తారో వారికి అకాల మరణం ఉండదని వారు భయం లేకుండా జీవిస్తారని చెప్తుంటారు. అంతే కాదు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉందండోయ్. పురాణాల ప్రకారం ఎల్లప్పుడూ యమ ధర్మరాజు పక్కనే అతని కార్యదర్శి చిత్రగుప్తుడి ఉంటాడు. కాగా ఈ దేవాలయంలో కూడా చిత్రగుప్తుడికి ఒక ప్రత్యేక గది ఉందట. మనుషులందరూ చేసే తప్పు, ఒప్పులను ఒక పుస్తకంలో ఇక్కడ ఉంచారని గ్రామ ప్రజలు చెప్తారు.
ఈ దేవాలయంలో బంగారం, వెండి, రాగి, ఇనుముతో చేసిన నాలుగు రకాలైన ద్వారాలు ఉన్నాయని అక్కడి స్థానికులు విశ్వాసం. ఎవరైతే భూమి మీద ఎక్కువ పాపాలు చేస్తారో.. వారి ఆత్మలన్నీ ఇనుప ద్వారం లోపలికి వెళ్తాయని, అదే విధంగా పుణ్యం చేసిన వారి ఆత్మలు బంగారం ద్వారం ద్వారా లోపలికి వెళ్తాయని నమ్ముతారు. అందుకే ఈ గుడి లోపలికి ఎవరూ వెళ్లకుండా కేవలం బయటి నుంచే యమ ధర్మరాజుకు నమస్కారం చేసుకుని వెళ్లిపోతారట. ఇంక ఈ గుడి ప్రాంగణంలో మృతి చెందిన వారికి పిండ ప్రదానం చేస్తారు. ఈ ఆలయం సమీపంలో వైతర్ణి నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. గరుడ పురాణంలో కూడా యమరాజు ఆస్థానానికి సమీపంలో ఉన్న వైతర్ణి నది గురించి ప్రస్తావన ఉంది. ఇందండి ఎవ్వరూ ప్రవేశించని ప్రపంచంలోనే యముడికి ఉన్న ఏకైక గుడి సమాచారం. మీరు వెళ్లి ఓసారి చూసి రండి.
ఇదీ చదవండి: ఏంటీ వింత.. ఆకాశంలో కదులుతున్న రైలు..!