Srisailam: శ్రీశైలం ఆలయంలో నూతనంగా ఉదయాస్తమాన సేవ, ప్రదోషకాల సేవలను ప్రారంభించారు ఆలయ ఈవో లవన్న. ఈ రెండు సేవలను పరిపాలనా భవనంలో ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. సెప్టెంబర్ 5 నుండి ఈ సేవలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఉదయాస్తమాయసేవలో పాల్గొనే భక్తులకు ఆలయం ద్వారాలు తెరిచినది మొదలు, తిరిగి ఆలయ ద్వారాలు మూసివేసేంత వరకు స్వామి అమ్మవార్లకు నిర్వహించే 14 సేవలలో పాల్గొనే విధంగా దేవస్థానం అవకాశం కల్పించింది. అలాగే ప్రదోషకాల సేవలో పాల్గొనే భక్తులకు సాయంత్రం ఆలయంలో నిర్వహించే మహామంగళహారతి, స్వామివారి గర్భాలయంలో పంచామృతాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, వేదాశీర్వచనం కల్పిస్తున్నారు.
ఇక ఈ సేవలలో పాల్గొనేందుకు భక్తులు వెబ్ సైట్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. అయితే రోజుకు ఈ సేవలకు 6 టికెట్లు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉదయాస్తమాన సేవకు లక్షా 11వందల 16 రూపాయలు కాగా, ప్రదోషకాల సేవకు 25వేల 116 రూపాయలుగా టికెట్ ధర నిర్ణయించినట్లు వెల్లడించారు.