Lunar eclipse 2022: ఈ ఏడాది చిట్టచివరి గ్రహణం నేడు కార్తీక పౌర్ణమి రోజున ఏర్పడుతోంది. ఇది చంద్రగ్రహణం కాగా, ఈ ఏడాదిలో ఏర్పడుతున్న రెండో చంద్రగ్రహణం. దీపావళి మర్నాడు సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజుల్లోనే ఈ గ్రహణం ఏర్పడుతుండటం విశేషం. అంతేకాదు, ఈ ఏడాది ఏర్పడిన నాలుగు గ్రహణాలు రెండు వారాల వ్యవధిలోనే రావడం చెప్పుకోదగ్గ అంశం. రెండో చంద్రగ్రహణం భారత్‌తో పాటు ఉత్తర, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర పసిఫిక్, హిందూ మహాసముద్రం ప్రాంతాల్లోనూ దర్శనమిస్తుంది. మళ్లీ ఇటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం మూడేళ్ల తర్వాత 2025 మార్చి 14న ఏర్పడనుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది.
నేడు చంద్రుడు భూమి నీడలోకి వెళ్లి ఎరుపు రంగులోకి మారతాడు.. దాదాపు 3 సంవత్సరాల తర్వాతే ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం మళ్లీ ఏర్పడనుంది. మూడేళ్లలో కనిపించే చిట్టచివరి గ్రహణం కాబట్టి ఇది మీ ప్రాంతంలో దర్శనమిస్తుందా? లేదా తప్పకుండా తెలుసుకోండి అని నాసా ట్వీట్ చేసింది. పూర్తిగా భూమి నీడలోకి వెళ్లిన చంద్రుడ్ని ఉత్తర, మధ్య అమెరికా, ఈక్విడార్, కొలంబియా, పశ్చిమాన వెనుజులా, పెరూ, ప్యూర్టారికోలో చూడవచ్చని తెలిపింది. ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోనూ గ్రహణం కనిపిస్తుందని, అలస్కా, హవాయిలో గ్రహణం అన్ని దశలనూ చూడొచ్చని నాసా పేర్కొంది.
ఈ చంద్రగ్రహణం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6.30 గంటల వరకూ కొనసాగుతోంది. భారత్‌లో పూర్తిస్థాయి గ్రహణం 5.32 గంటల నుంచి 6.18 వరకూ 45 నిమిషాల 48 సెకెన్లు దర్శనమివ్వనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. గ్రహణం ప్రారంభమైన దాదాపు గంట తర్వాత 3.46 గంటలకు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్లిపోతాడు. సాయంత్రం 4.29 గంటలకు దాని ప్రభావం పూర్తిగా కనపడుతుంది. ఇలా 5.11 గంటల వరకూ సాగుతుంది. అప్పటి నుంచి క్రమంగా చంద్రుడి కక్ష్య నుంచి భూమి తప్పుకోవడం మొదలై సాయంత్రం 6:19 గంటలకు గ్రహణం ముగుస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో చంద్రోదయం తర్వాత గ్రహణం చూసే అవకాశం ఉందని తెలిపారు.
గ్రహణం కారణంగా అన్ని ఆలయాలు మూసివేయనున్నారు. చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 11 గంటల పాటు ఆలయాల తలుపులు మూసివేయనున్నారు. ఈ కారణంగా తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. చంద్రగ్రహణం కారణంగా శ్రీవాణి, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి, శుద్ధి చేశాక సర్వదర్శనాలను ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.