Prime9

Ashada Bonalu: ఆషాడం బోనాలకు వేళాయే.. ఈనెల 26 నుంచి షురూ

Telangana: హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాలు సహా.. తెలంగాణలో ఆషాడ బోనాలకు సమయం ఆసన్నమైంది. ఈనెల 26 నుంచి ఆషాడ బోనాల వేడుకలు షురూ కానున్నాయి. ఆషాడ మాసం నెలరోజులపాటు బోనాల పండుగ జరగనుంది. కాగా తొలుత గోల్కొండ కోటలో కొలువైన జగదాంబ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించడంతో బోనాల జాతర ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ లోని 28 ప్ముఖ ఆలాయాల్లో ఆషాడ బోనాల పండుగ జరగనుంది. దీంతో దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు, జాతరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.

 

ఈనెల 26న గోల్కొండ కోటలోని జగదాంబ మహంకాళికి తొలి బోనం సమర్పించనున్నారు. అనంతరం జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బోనాల కార్యక్రమం జరగనుంది. అలాగే జూలై 13, 14 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, జూలై 20, 21 తేదీల్లో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో, నాచారంలోని మహంకాళి సమేత మహాకాళేశ్వర ఆలయంలో బోనాలు జరగనున్నాయని అధికారులు వెల్లడించారు.

ఇక ఆషాడ బోనాల పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజూరు చేసింది. దీంతో బోనాలు సమర్పించేందుకు ఆలయాలకు వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పిస్తారు. అలాగే ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు వేయనున్నారు. అలాగే వచ్చేది వర్షాకాలం సీజన్ కావడంతో ఎలాంటి అపరిశుభ్ర వాతావరణం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. బోనం సమర్పణలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ ఇబ్బందులపై సమీక్ష చేపట్టారు. అలాగే ఆలయాలకు కొత్త రంగులు వేయడం, విద్యుత్ దీపాలతో అలంకరణ లాంటి పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు దేవాదాయశాఖ మంత్రి, కమిషనర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version
Skip to toolbar