Yadadri Accident: ఘోర ప్రమాదం..చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు దుర్మరణం

Accident At Pochampally: తెలంగాణలో ఘోర విషాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్‌పూర్‌ దగ్గర ఓ కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ఆ వాహనం చెరువులో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు యువకులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను బయటకు తీశారు. మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో మొత్తం కారులో ఆరుగురు ఉన్నట్లు నిర్దారించారు. మృతులు హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్‌లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి పోచంపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.