Man Kills Lover Parents:వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది తను ప్రేమించిన యువతి కుటుంబంపై దాడికి పాల్పడిన సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చింతలతండాలో జరిగింది. గిర్నిబాయికి చెందిన నాగరాజు అలియాస్ బన్నీ చింతలతండాకి చెందిన దీపిక కొద్ది రోజులుగా ప్రేమించుకున్నారు.అంతేకాదు మూడు నెలలు వీరు సహజీవనం కూడా చేశారు.అయితే ఆ తర్వాత నాగరాజు ప్రవర్తన నచ్చకపోవడంతో ఈ పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.దీంతో పోలీస్ స్టేషన్లో కాంప్రమైజ్ అయి ఎవరింటికి వారు వెళ్లిపోయారు కూడా .అయితే తాను ప్రేమించిన యువతి తన నుండి విడిపోవడానికి యువతి తల్లిదండ్రులే కారణమని.. వారిద్దరినీ విడదీశారనే కోపంతో ప్రియుడు నాగరాజు ఆ కుటుంబం పై కక్షపెంచుకున్నాడు.
నిద్రిస్తున్న వారిపై దాడి చేసి..(Man Kills Lover Parents)
గురువారం ఉదయం తల్వార్ తో దీపిక కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు.ఇంటి బయట నిద్రిస్తున్న ప్రేయసి కుటుంబంపై తల్వార్ తో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో యువతి తల్లి బానోతు సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా,తండ్రి బానోతు శ్రీనివాస్ నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఇక నాగరాజు ప్రేయసి దీపిక ,ఆమె సోదరుడు మదన్ గాయాల పాలై ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.కాగా ప్రస్తుతం ప్రేమోన్మాది నాగరాజు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారం ఓ కుటుంబాన్ని బలి తీసుకోవడంతో ఆ గ్రామమంతా విషాద ఛాయలు అలముకున్నాయి.