Female constable Suicide: రాయలసీమలోని అన్నమయ్య జిల్లాలో ఒక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది . జిల్లాలోని రాయచోటిలో ఎస్పీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విధి నిర్వహణలో ఉన్న ఏఆర్ మహిళా కానిస్టేబుల్ వేదవతి తన సర్వీస్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే … పుంగనూరు సమీపంలోని బింగానిపల్లెకు చెందిన వేదవతికి.. మదనపల్లెకు చెందిన దస్తగిరికి ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది . వీళ్లిద్దరికీ ఐదేళ్ల కుమార్తె కూడా ఉంది. వేదవతి భర్త దస్తగిరి పుంగనూరులోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. వేదవతి చిత్తూరు నుంచి ఏడాది కిందట అన్నమయ్య జిల్లాకు బదిలీపై వచ్చింది . ప్రస్తుతం భర్త దస్తగిరితో కలిసి రాయచోటి పట్టణంలోని రాజీవ్ స్వగృహకు సముదాయానికి సమీపంలోవున్న ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు.
వికటించిన ప్రేమ వివాహం..( Female constable Suicide)
ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి తన చేతిలో ఉన్న సర్వీస్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలంరేపింది. గార్డు గది లో పెద్ద శబ్దం రావడంతో అక్కడే ఉన్న ఇతర పోలీసులు, సిబ్బంది అక్కడికి వెళ్లారు . అప్పటికే వేదవతి చనిపోయినట్లుగా గుర్తించారు. వెంటనే ఆమె మృతదేహాన్ని రాయచోటి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆమె ఆత్మహత్యకు ముందు ఓ ఫోన్ కాల్ మాట్లాడినట్లు తెలుస్తోంది. కుటుంబంలో తలెత్తిన కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తుండగా.. శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య ఇంట్లో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దస్తగిరి పనిచేస్తున్న కోచింగ్ సెంటర్లోనే వేదావతి పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంది .అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది .కానీ అప్పటికే దస్తగిరి వివాహం అయి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది .