Nandyal: నంద్యాలలో దారుణం.. ప్రేమించలేదని బాలికకు నిప్పంటించిన బాలుడు

A Boy Murdered inter student Pour petrol in Nandyal: నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నందికొట్కూరులో ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి ఓ బాలుడు నిప్పంటించాడు. అనంతరం బాలుడు కూడా నిప్పు అంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలికను ప్రేమిస్తున్నానంటూ ఓ బాలుడు వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ తరుణంలో ప్రేమించడం లేదని ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తి మండలంలోని కలగొట్లకు చెందిన బాలుడు ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్నాడు. ఈ బాలుడు సామర్లకోటకు చెందిన ఓ బాలికను ప్రేమించాలని కొంతకాలంగా వెంటపడుతున్నాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆ బాలికను నందికొట్కూరులోని అమ్మమ్మ ఇంటికి పంపించారు. అయితే ఆ బాలిక ఎక్కడికి వెళ్లిందనే విషయాన్ని ఆ బాలుడు తెలుసుకున్నాడు. సరిగ్గా 6 నెలల తర్వాత మళ్లీ ఆ బాలిక ఆచూకీ తెలుసుకొని అక్కడికి వెళ్లాడు.

కాగా, విషయం తెలుసుకున్న ఆ బాలిక ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాలిక అమ్మమ్మకు చెప్పారు. బాలిక మిత్రులు ఎవరొచ్చినా ఇంటి వద్దకు రావొద్దని తెలియజేశారు. దీంతో ఆ బాలుడు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాలిక ఇంటికి వెళ్లాడు. నేరుగా ఆ బాలిక గదిలోకి వెళ్లి ఒక్కసారిగా దాడికి యత్నించాడు. ఇంతలోనే ఆ బాలికపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. మంటల్లో కాలిపోతూ కేకలు పెడుతూ చనిపోయింది.

అయితే తొలుత రూంలోకి వెళ్లిన వెంటనే ఆ బాలుడు.. ఆ బాలిక అరవకుండా నోట్లో దుస్తులు కుక్కి నిప్పంటించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆ బాలుడికి కూడా నిప్పు అంటుకుందా? లేదా కావాలని నిప్పంటించుకున్నాడా?వంటి వివరాలు తెలియరాలేదు. కానీ మంటల్లోనే పారిపోవాలని యత్నించాడు. వెంటనే విషయం తెలుసుకున్న స్థానికులు ఆ బాలుడిని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతి చెందిన బాలికను పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.