Twitter: ఇటీవల కాలంలో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ సంచలన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యానికి గురించేస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ అధినేత మస్క్ అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. ట్విట్టర్ నుంచి ఒక వివాదం ముగిసేలోపే మరొకటి వెలుగులోకి వస్తోంది. తాజాగా.. ట్విట్టర్ హెడ్ ఆఫీసు అద్దె కట్టట్లేదంటూ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన కొలంబియా రెయిత్ కంపెనీ కోర్టు కెక్కింది.
ట్విట్టర్ కంపెనీ 1.36 లక్షల డాలర్ల అద్దె బకాయి ఉందని ఆరోపిస్తోంది. ట్విట్టర్ హెడ్ ఆఫీస్ శాన్ ఫ్రాన్సిస్కోలోని హార్ట్ ఫోర్డ్ బిల్డింగ్ లో 30వ అంతస్థులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ బిల్డింగ్ ఓనర్ కొలంబియా రెయిత్ కంపెనీ వారు. కాగా గత కొన్ని ఏళ్లుగా ఆ బిల్డింగ్ లో అద్దెకు ట్విట్టర్ ఆఫీసును నడుపుతున్నారు ఆ మైక్రోబ్లాగింగ్ యాజమాన్యం. అయితే, ఇటీవల కొన్ని వారాల నుంచి ట్విట్టర్ అద్దె చెల్లించట్లేదని ఆరోపిస్తూ కొలంబియా రెయిత్ కోర్టుకెక్కింది. దీనిపై గత నెల 16న ట్విట్టర్ కు నోటీసులు కూడా ఇచ్చినట్లు పేర్కొంది. అయినా కూడా ఎలాంటి స్పందన రాలేదని దానితోనే ట్విట్టర్ పై కోర్టులో దావా వేసినట్లు ఓ ప్రకటనలో వివరించింది.
కాగా, శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంతో పాటు ట్విట్టర్ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఉన్న కార్యాలయాలకు సంబంధించిన అద్దె కూడా చెల్లించడంలేదని సమాచారం. దీనిపై కూడా ట్విట్టర్ ఏమీ స్పందించలేదు. మరి మస్క్ ఈ విషయంపై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.