TATA Consultancy Service: భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రజలు ఐటీ సేవల వైపు పరుగులు పెడుతున్నారు. సెల్ ఫోన్ మొదలుకుని ఇంట్లోని గ్యాడ్జెట్స్ వరకు నిత్యం మనం ఐటీ రంగం ద్వారా ఏదో ఒక రూపంలో సేవలు పొందుతూనే ఉన్నాం. కాగా ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత విలువైన భారత బ్రాండ్ ఏంటీ అంటూ ఓ సంస్థ సర్వే చేసింది. దీనిలో ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అత్యంత విలువైన బ్రాండ్ గా నిలిచింది. ఇకపోతే అత్యుత్తమ 50 బ్రాండ్‌లతో ఈ జాబితాను ఇంటర్‌బ్రాండ్ సంస్థ రిలీజ్ చేసింది. ఈ జాబితాలో రూ.1,09,576 కోట్ల బ్రాండ్ విలువతో టీసీఎస్ మొదటి స్థానంలో నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.65,320 కోట్ల బ్రాండ్ వాల్యూతో రెండో స్థానంలో నిలువగా.. ఇన్ఫోసిస్ రూ.53,324 మూడో స్థానంలో నిలిచింది.
అత్యంత విలువైన బ్రాండ్ గా టీసీఎస్(TATA Consultancy Service)
గత పదేళ్ల కాలంలో ఇతర రంగాలను అధిగమించి టెక్నాలజీ రంగం అగ్రస్థానంలో దూసుకుపోతుంది. మొదటి 5 బ్రాండ్‌లలో 3 స్థానాలను టెక్నాలజీ కంపెనీలే దక్కించుకుంటున్నాయి. ఆర్థిక సేవల రంగం నుంచి మరో 9 సంస్థలు కూడా జాబితాలో చోటు దక్కించుకున్నాయి. హోమ్ బిల్డింగ్, ఇన్‌ఫ్రా రంగం నుంచి 7 కంపెనీలకు ఈ లిస్ట్ లో స్థానం ఉంది. గత దశాబ్ధంలో వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న రంగాల్లో ఎఫ్‌ఎమ్‌సీజీ ప్రథమ స్థానంలో నిలిచింది.హోమ్ బిల్డింగ్, ఇన్‌ఫ్రా రంగం రూ.6900 కోట్ల నుంచి రూ.34,400 కోట్లకు వృద్ధి చెందగా, టెక్నాలజీ రూ.69,300 కోట్ల నుంచి రూ.2.5 లక్షల కోట్లకు దూసుకెళ్లింది. అగ్రగామి 10 బ్రాండ్‌ల మొత్తం విలువలో మొదటి మూడు బ్రాండ్‌ల వాటా 46 శాతంగా ఉంది.