Stock Market Crash: పోలింగ్‌కు ఒక్క రోజు ముందు అంటే శనివారం నాడు చివరి విడత లోకసభ పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో ఇటు సెన్సెక్స్‌తో పాటు నిఫ్టీ కూడా ఒక శాతం వరకు క్షీణించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 800 పాయింట్ల కంటే ఎక్కువగానే కుంగి 73,668.73 మార్కుకు దిగివచ్చింది. అలాగే నిఫ్టీ కూడా 250 పాయింట్లు క్షీణించి 22,459.13 పాయింట్ల వద్ద స్థిరపడింది. వరుసగా గత నాలుగు రోజుల నుంచి స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూస్తూ వస్తోంది.
ఎట్టకేలకు మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ 617 పాయింట్లు నష్టపోయి 73,885.60 పాయింట్ల వద్ద, నిఫ్టీ 216 పాయింట్లు క్షీణించి 22,488.65 వద్ద క్లోజ్ అయ్యింది. దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోవడానికి పలు కారణాలున్నాయని చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. వాటిలో ప్రధానంగా రిలయన్స్ ఇండస్ర్టీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లలో కరెక్షన్ వల్ల దాని ప్రభావం సెన్సెక్స్‌పై పడిందని చెబుతున్నారు. రెండోది.. జూన్ 1 శనివారం నాడు తుది విడత పోలింగ్ జరగనుంది. దాని ప్రభావం మార్కెట్లపై చూపించింది. ఒక వేళ ఎన్‌డీఏ కూటమికి పరిస్థితులు అనుకూలంగా లేకపోతే మార్కెట్లు 10 నుంచి 15 శాతం వరకు కరెక్షన్ ఏర్పడే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మార్కెట్లు నష్టపోవడానికి మరో అంశం ఏమిటంటే అమెరికా ఫెడరల్ రిజర్వు త్వరలోనే కీలక వడ్డీరేట్లు పెంచుతామని చూచాయిగా ప్రకటించడం కూడా మార్కెట్లపై వ్యతిరేక ప్రభావం చూపించిందంటున్నారు. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం అంచనా కంటే కూడా పెరిగిపోవడం కూడా మార్కెట్ల నష్టానికి కారణమని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. గురువారంతో నెలవారి ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ కావడంతో ట్రేడర్లు తమ పోజిషన్‌లు స్క్వేరప్ చేశారు. దీంతో పాటు ఆసియా మార్కెట్లు నష్టాలతో ట్రేడ్ కావడంతో సెంటిమెంట్ ప్రకారం దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై పడిందన్న టాక్ వినిపిస్తోంది.