Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. బ్యాంకింగ్ తో పాటు ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడితో భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సూచీలను కిందకు లాగాయి. దీంతో ఇంట్రాడే గరిష్ఠాల నుంచి సెన్సెక్స్ 1600 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 21,250 దిగువకు చేరింది. సోనీ కంపెనీతో డీల్ రద్దవడంతో జీ షేర్లు భారీగా పతనమయ్యాయి.
ఇక ట్రేడింగ్ సరళిని గమనిస్తే.. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 71 వేల 868.20 వద్ద లాభాలతో ప్రారంభమైంది. కాసేపు లాభాల్లో కొనసాగిన సూచీ.. తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో సూచీలకు భారీ నష్టాలు ఎదురయ్యాయి. ఇంట్రాడేలో 72 వేల 039.20 వద్ద గరిష్ఠాలను నమోదు చేసిన సూచీ.. 70 వేల 234.55 వద్ద కనిష్ఠానికి దిగివచ్చింది. చివరికి 1,053.10 పాయింట్ల నష్టంతో 70 వేల 370.55 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 325.70 పాయింట్ల నష్టంతో 21వేల246.10 వద్ద క్లోజైంది.
సెన్సెక్స్‌లో ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు భారీగా నష్టపోయాయి. సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 83.16 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా.. యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.సోనీతో కుదిరిన ఒప్పందం రద్దవడంతో జీ షేర్లు కుదేలయ్యాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కుదుర్చుకున్న 10 బిలియన్ డాలర్ల విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు సోనీ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనితో మంగళవారం జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు 30.50 శాతం మేర పతనమయ్యాయి. లోయర్ సర్క్యూట్లను తాకుతూ 52 వారాల కనిష్ఠమైన రూ.152.50కి దిగివచ్చింది.