SBI: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన లిమిటెడ్ టైం స్పెషల్ డిపాజిట్ స్కీమ్ ‘అమృత్ కలశ్ డిపాజిట్’ మరోసారి తీసుకొచ్చింది. 400 రోజుల కాలవ్యవధితో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. నిజానికి 2023 మార్చి 31తో ఈ స్కీమ్ గడువు ముగిసింది. అయితే ఎస్బీఐ తాజాగా ఈ స్కీమ్‌ను పునరుద్ధరించింది. ఇపుడు ఈ పథకం జూన్ 30 వరకు అందుబాటులో ఉండనుంది.
అమృత్ కలశ్ వివరాలివే..(SBI)
ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్స్ కు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు ఇవ్వనుంది. ఏప్రిల్ 12 నుంచి జూన్ 30 వరకు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం వడ్డీపై మూలం వద్ద పన్ను కోత ఉంటుందని ఎస్బీఐ స్పష్టం చేసింది. అన్ని ఎస్బీఐ శాఖలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఈ స్సెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. రూ. 2 కోట్లలోపు మొత్తాలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది.
రుణ సదుపాయం కూడా(SBI)
తక్కువ సమయం లక్ష్యంతో పొదుపు చేసేవారికి అమృత్ కలశ్ పథకం ఉపయోగకరంగా ఉంటుంది. పైగా డిపాజిట్‌ను ముందుగా ఉపసంహరించుకునే వీలు ఉంది. అలాగే రుణ సదుపాయం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఎస్బీఐ 7 రోజుల నుంచి 10 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3 నుంచి 7 శాతం వడ్డీరేటును చెల్లిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం నుంచి 7.50 శాతం అధికంగా అందిస్తోంది.