McDonalds: ప్రపంచంలోనే అతిపెద్ద ఫాస్ట్ ఫుడ్ చైన్ అయిన మెక్‌డొనాల్డ్స్ త్వరలో లేఆఫ్స్ ప్రకటించేందుకు సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో తన కార్యకలాపాలను తాత్కాలికంగా మూసివేయనున్నట్టు ప్రకటించింది. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు ఈ మూసివేతలు ఉండనున్నాయి. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
అమెరికాలోని ఉద్యోగులందరికీ అంతర్గత మెయిల్స్ పంపింది మెక్ డొనాల్డ్. ఈ మూడు రోజుల ఇంటి నుంచే పనిచేయాలని ఆ మెయిల్ లో పేర్కొంది. అదే విధంగా విక్రేతలు, ఇతర బయటి పార్టీలతో జరిగే అన్ని వ్యక్తిగత సమావేశాలను రద్దు చేసుకోవాలని ఆదేశించింది. అలాగే ఏప్రిల్ 3 వ వారంలో ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాన్ని తెలపుతామని కంపెనీ మెయిల్ లో తెలిపింది.
జనవరిలోనే వెల్లడి(McDonalds)
అయితే, ఏప్రిల్ నెలలో కార్పొరేట్ విభాగం నుంచి ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు మెక్‌డొనాల్డ్స్ జనవరిలోనే ప్రకటించింది. మెక్‌డొనాల్డ్స్ లేఆఫ్‌లు ఏప్రిల్‌లో ప్రారంభమవుతాయని ఒక ఇంటర్వ్యూలో కంపెనీ సీఈఓ వెల్లడించారు. ప్రస్తుతం, మెక్‌డొనాల్డ్స్ లో ప్రపంచవ్యాప్తంగా 1,50,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ఎదుర్కోవడానికి పలు బడా కంపెనీలు ఇప్పటికే ఉద్యోగుల కోతలు విధించాయి. టెక్ దిగ్గజాలైన అమెజాన్, ఫేస్ బుక్ తో సహా అనేక పెద్ద కంపెనీలు ఇటీవల తమ సిబ్బంది భారీగా తగ్గించుకున్నాయి. ఈ భారీ తొలగింపుల్లో నష్టపోయిన వారిలో ఇండియన్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. మెక్‌డొనాల్డ్స్ విషయానికి వస్తే‘మరింత డైనమిక్, అతి చురుకైన పోటీతత్వం’గా మార్చడానికి అనేక రౌండ్ల తొలగింపులను నిర్వహించింది.