IT Returns: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయం దగ్గర పడుతోంది. గత ఆర్థిక సంవత్సరానికి గాను పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు గాను ఇప్పటికే రిటర్న్ పత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఆదాయపు పన్ను డిపార్ట్ మెంట్ ఇప్పటి వరకూ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆడిట్ అవసరం లేని వారు జులై 31 వరకూ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో 2022-23 ఆర్థిక సంవత్సారానికి రిటర్నులు దాఖలు చేసేటప్పుడు తప్పులు లేకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా ఈ ఏడాది కొత్తగా రిటర్నులు దాఖలు చేసే వారు ముందుగా ఇన్ కమ్ టాక్స్ పోర్టల్‌లో రిజిష్టర్ చేసుకోవాలి. ఇందు కోసం రిటర్నులను సమర్పించడానికి కొన్ని ఫామ్స్ సిద్ధం చేసుకోవాలి.
రిటర్నులు దాఖలు చేయడానికి అతి ముఖ్యమైనది పాన్ కార్డు. కాబట్టి పాన్ కార్డులో మీ పేరు సరిగా ఉందా లేదా ఒక సారి చెక్ చేసుకోవాలి. ఏలాంటి మార్పులు చేసుకోవాలన్నా వెంటనే సరిదిద్దుకునేందుకు అప్లై చేసుకోవాలి.
రిటర్నులను సమర్పించేందుకు ఆధార్ కార్డు కూడా అవసరం. మీ పాన్- ఆధార్ అనుసంధానం అయి ఉండాలి. ఒక వేళ లింక్ చేయకపోతే.. ముందుగా ఆ పనిని కంప్లీట్ చేసుకోవాలి. పాన్ కార్డు, ఆధార్ కార్డులో వివరాలు సరిగ్గా ఉన్నప్పుడే లింక్ అవుతాయి. పాన్-ఆధార్ లింక్ కోసం జూన్ 30 వరకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో తప్పులు ఏవైనా ఉంటే సరిచేసుకోవాలి. ఆధార్‌కు అనుసంధానంగా ఫోన్ నంబరు ఉండాలి. అప్పుడే ఓటీపీతో ఈ వెరిఫికేషన్ చేయొచ్చు.
తర్వాత మీ యాజమాన్యం ఇచ్చిన ఫారం 16 ను జాగ్రత్తగా చూసుకోవాలి. మీ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. మీ పాన్, ఆదాయం, టీడీఎస్, మినహాయింపు వివరాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలి. రిటర్నులు దాఖలు చేసేటప్పుడు బ్యాంకు ఖాతా, IFSC కోడ్ అవసరమవుతాయి. వాటిని కూడా దగ్గర ఉంచుకోవాలి. రీఫండ్ ఉన్నప్పుడు మీరు ఇచ్చిన బ్యాంకు ఖాతాలోకే జమ అవుతుంది.వివిధ
ఆదాయాలు, టీడీఎస్ వివరాలను తెలియజేసే ఫారం 26 ఏఎస్‌ను మర్చిపోవద్దు. ఇందులో ఏమైనా తేడాలు ఉంటే సంస్థ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి. పలు సెక్షన్ల కింద మినహాయింపులు పొందేందుకు చేసిన పెట్టుబడులకు తగిన ఆధారాలన్నీ ఒకే దగ్గర జాగ్రత్త చేసుకోవాలి.
ఆదాయపు పన్ను రిటర్నుల ఫారాలు మొత్తం 7 రకాలుగా ఉంటాయి. కాబట్టి రిటర్నులు దాఖలు చేసేందుకు సరైన పత్రాన్ని ఎంచుకోండి. ఫారం-16 తో పాటు, ఐటీఆర్ ఫారాన్ని, అక్నాలడ్జ్‌మెంట్, పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలను జాగ్రత్తగా పెట్టుకోవాలి.