IPO Clearance: కొత్త తరం కంపెనీల పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)లకు అనుమతులపై మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మరింత కఠినతరం చేసింది. పేటీఎం పబ్లిక్ ఇష్యూ మదుపర్లకు భారీ నష్టాలు మిగిల్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అంతేకాకుండా గత రెండు నెలల్లో ఆరు కంపెనీల ఐపీఓ అభ్యర్థనలను రిజెక్ట్ చేసింది. ఇందులో ఓయో సంస్థ కూడా ఉంది. మరిన్ని డాక్యుమెంట్లతో, మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, లావా ఇంటర్నేషనల్, బీ2బీ చెల్లింపులు సేవల సంస్థ పేమేట్ ఇండియా,
ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇండియా, ఇంటిగ్రేటేడ్ సర్వీసెస్ కంపెనీ బీవీజీ ఇండియాకు సంబంధించిన ఐపీఓ దరఖాస్తులనూ సెబీ తిరస్కరించింది.
సెబీ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు(IPO Clearance)
ఈ కంపెనీలు 2021 సెప్టెంబర్ నుంచి 2022 మే మధ్య కాలంలో సమర్పించిన పత్రాలను దాఖలు చేశాయి. అయితే ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 10 మధ్య వాటిని సెబీ తిరస్కరించింది.
కొన్ని కంపెనీలు భారీ ప్రీమియంతో మార్కెట్ కు వచ్చి ఇన్వెస్టర్లను నిండా ముంచిన నేపథ్యంలో సెబీ ఈ కఠిన చర్యలు తీసుకుందని భావిస్తున్నారు.
2021 నవంబర్ లో పేటీఎం భారీ ప్రీమియంతో మార్కెట్ కు వచ్చింది. ఆయా కంపెనీ కంపెనీల షేర్లు సెకండరీ మార్కెట్లో ఇప్పటికీ 72 శాతం డిస్కౌంట్ తో లభిస్తున్నాయి.
దీంతో సెబీ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఐపీఏ పత్రాల పరిశీలనను సెబీ కఠినం చేసిందని సమాచారం.
ఆ కారణంగానే..
కాగా, సెబీ కఠిన రూల్స్ తో పాటు మార్కెట్ ఒడిదొడుకులు ఐపీఓ మార్కెట్‌ను దెబ్బతీశాయి. 2021లో ఐపీఓల ద్వారా 63 కంపెనీలు రూ. 1.2 లక్షల కోట్లు సమీకరించాయి.
2022 లో 38 సంస్థలు రూ. 59 వేల కోట్లు సమీకరించాయి. ఎల్ఐసీ రూ. 20,557 కోట్ల ఇష్యూ లేకపోతే, గత ఏడాది ఈ మెత్తం మరింత తక్కువ ఉండేది.
ఈ సంవత్సరం పరిస్థితి మరింత కఠినంగా ఉంది. ఇప్పటి వరకు కేవలం రెండు కంపెనీలు మాత్రమే ఐపీఓల ద్వారా రూ. 750 కోట్లు సమీకరించాయి.
ఐపీఓ పత్రాలు సమర్పించిన కంపెనీల సంఖ్య కూడా 9కి మించి లేవు.
ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కంపెనీలు ముఖ్యంగా చిన్న కంపెనీలేవీ ఐపీఓల జారీకి సాహసించడం లేదు.