Intel Co Founder: అమెరికన్ మల్టీనేషనల్ కార్పొరేషన్, టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు గోర్డాన్ మూరే (94) కన్నుమూశారు. శనివారం హవాయిలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ‘ఆయన చిరస్మరణీయం.. గొప్ప విజనరీని కోల్పోయమంటూ..’ ఇంటెల్ కార్పొరేషన్ ట్వీట్ చేసింది. మూరే దూరదృష్టి హైటెక్ యుగానికి వేదికైంది అంటూ వ్యాపార వర్గాలు నివాళులర్పించాయి. 1950 దశకంలో ఆయన సెమీకండక్టర్ల వ్యాపారం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆయన ఇంటెల్ కార్పొరేషన్ సంస్థను స్థాపించారు.
సెమీ కండక్టర్స్ వ్యాపారం కోసం ఆయన ఆ రోజుల్లో కొత్త రూల్స్ రూపొందించారు. కంప్యూటర్ ప్రాసెసర్ ఇండస్ట్రీలో విప్లమాత్మక మార్పులు తీసుకువచ్చారు. పీసీ రెవల్యూషన్ లో ఆయన పాత్ర ప్రత్యేకమైంది. మెమోరీ చిప్స్ తయారీలోనూ మూర్ తనదైన ముద్ర వేశారు. ఎలక్ట్రానిక్స్‌ను ప్రపంచంలోని అతిపెద్ద పరిశ్రమలలో ఒకటిగా మార్చి సరికొత్త విప్లవానికి నాంది పలికారు. మైక్రోచిప్ పరిశ్రమలో 500 డాలర్ల పెట్టుబడితో బిలియనీర్‌గా అవతరించారు. 1960లలో కంప్యూటర్ చిప్ సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన కాలిఫోర్నియా సెమీకండక్టర్ చిప్ మేకర్ ఇంటెల్.
Today, we lost a visionary.
Gordon Moore, thank you for everything. pic.twitter.com/bAiBAtmd9K
— Intel (@intel) March 25, 2023
అరుదైన ఘనత ఆయనదే(Intel Co Founder)
మూరే అతని దీర్ఘకాల సహచరుడు రాబర్ట్ నోయ్స్ జూలై 1968లో ఇంటెల్‌ను స్థాపించారు. వందల మిలియన్ల మందికి ల్యాప్‌టాప్ కంప్యూటర్‌లను అందుబాటులోకి తెచ్చిన ఘనత, టోస్టర్ ఓవెన్‌లు, బాత్‌రూమ్ స్కేల్స్ , టాయ్ ఫైర్ ట్రక్కుల నుండి టెలిఫోన్‌లు, ఆటోమొబైల్స్ ,ఎయిర్‌క్రాఫ్ట్ దాకా తమ మైక్రోప్రాసెసర్‌లతో అరుదైన ఘనతను మూరే దక్కించుకున్నారు. 1975లో ఇంటెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికంటే ముందు మూరే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 1979లో బోర్డ్ ఛైర్మన్, సీఈవోగా నియమితుడయ్యారు. 1987లో సీఈవోగా పదవి నుంచి వైదొలగి ఛైర్మన్‌గా ఉన్నారు. 1990ల నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయిన 80 శాతం కంప్యూటర్లలో ఇంటెల్ మైక్రోప్రాసెసర్లే. దాని ఫలితంగా చరిత్రలో అత్యంత సంపన్నమైన సెమీ కండక్టర్ వ్యాపారంగా నిలిచింది.
మూర్స్ లా
కంప్యూటర్ విప్లవం ప్రారంభమవడానికి రెండు దశాబ్దాల ముందే కంప్యూటర్ ప్రాసెసింగ్ పవర్స్ ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతాయని మూరే ముందే ఊహించాడు. ఆ తర్వాత దీన్ని ప్రతి రెండేళ్లకు అని సవరించారు. దీన్నే మూర్స్ లా అని పిలుస్తారు.