IndiGo Q4 Results: ఇండియాలో లీడింగ్ ఎయిర్‌లైన్ ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ మార్చితో ముగిసిన నాలుగవ త్రైమాసిక ఫలితాలను గురువారం నాడు వెల్లడించింది. ఏడాది ప్రాతిపదికన చూస్తే కంపెనీ ఏకీకృత నికరలాభం106 శాతం పెరిగి రూ.1,895కోట్లకు ఎగబాకింది.
క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.919 కోట్లు నమోదు చేసింది. రెవెన్యూ విషయానికి వస్తే ఏకంగా 26 శాతం పెరిగి రూ.17,825 కోట్లకు చేరిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ఈబీఐటీడీఏఆర్ విషయానికి వస్తే .. వడ్డీ, పన్నులు, తరుగుదల, అద్దెలు తదితరాలు చెల్లించడానికి ముందు త్రైమాసికం ప్రాతిపదికన చూస్తే 49 శాతం పెరిగి రూ.4,412 కోట్లకు ఎగబాకగా.. పన్నులు చెల్లించడానికి ముందు చూస్తేనికర లాభం 92 శాతం పెరిగి రూ.1,771 కోట్లకు ఎగబాకింది.
ప్రతి త్రైమాసికంలో భారీ లాభాలు..(IndiGo Q4 Results)
నాలుగవ త్రైమాసికంతో పాటు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం .. అంటే ప్రతి త్రైమాసికం కంపెనీ భారీ లాభాలను ఆర్జించింది. వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇచ్చాయి.. అనుకున్న టార్గెట్‌లను ఒక టీంగా సాధించామన్నారు ఇండిగో సీఈవో పీటర్ ఎల్బార్స్. మార్చితో ముగిసిన త్రైమాసికంలో టిక్కెట్ల ద్వారా రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన చూస్తే 25 శాతం పెరిగి రూ.15,601 కోట్లకు ఎగబాకింది. టిక్కెట్ల అమ్మకాలు కాకుండా ఇతర మార్గాల ద్వారా వచ్చే రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన 19 శాతం పెరిగి రూ.1,719 కోట్లకు చేరింది. ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం 55 శాతం పెరిగి రూ.680 కోట్లకు చేరిందని కంపెనీ ఒక ప్రకటనలో వివరించింది.
ఇక మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ వ్యయం విషయానికి వస్తే ఏడాది ప్రాతివదికన 22 శాతం పెరిగి రూ.16,734 కోట్లకు చేరగా.. ఇంధన వ్యయం 6 శాతం పెరిగి రూ.5,979 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో మొత్తం 26.7 మిలియన్ ప్యాసింజర్లను గమ్యస్థానానికి చేర్చింది. ఏడాది ప్రాతిపదికన చూస్తే ప్రయాణికుల సంఖ్య 14 శాతం పెరిగింది. గురుగ్రాం ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఇండిగో వద్ద 367 విమానాలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది మార్చి చివరి నాటికి కంపెనీ అప్పులు రూ.51,280 కోట్లుగా తేలింది. బీఎస్‌ఈలో దీని షేరు గురువారం నాడు 1.08 శాతం పెరిగి రూ.4,403 వద్ద క్లోజ్ అయ్యింది.