India Exports: 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి ఎగుమతులు రికార్డు బద్దలు కొట్టాయని ఆర్థికమంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 778 బిలియన్ డాలర్లుగా నమోదు కాగా.. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 776.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
పీఎల్ఐ అనుసంధానమే కారణం..(India Exports)
సేవల రంగం నుంచి ఎగుమతులు 325.3 బిలియన్ డాలర్ల నుంచి 341.1 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. అలాగే మర్చండైస్ ఎగుమతులు మాత్రం స్వల్పంగా క్షీణించాయి. 451.1 బిలియన్ డాలర్ల నుంచి 437.1 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి. అయితే ఎగుమతులు పుంజుకోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీంను వివిధ సెక్టార్‌లకు అనుసంధానించడమే కారణమని ఆర్థికమంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. వాటిలో ఎలక్ర్టానిక్ గూడ్స్‌కు పెద్ద పీట వేశాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లో ఇండియా కూడా పోటీ పడే సత్తా కలిగి ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో పీఎల్‌ఐ స్కీం ద్వారా దేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి వీలవుతుంది. దిగుమతులపై ఆధారపడ్డం కూడా తగ్గుతుందని ఆ వర్గాలు వివరించాయి. గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా ఎగుమతులు జరిగిన దేశాల విషయానికి వస్తే చైనా, రష్యా, ఇరాక్, యూఏఈ, సింగపూర్ ప్రధాన దేశాలుగా చెప్పుకోవచ్చు. ఈ దేశాలకు ఇండియా నుంచి ఎగుమతులు భారీగా పెరిగాయి. అలాగే టాప్ 10 దేశాల జాబితాలో బ్రిటన్, ఆస్ర్టేలియా, సౌదీ రేబియా, నెదర్లాండ్స్, దక్షిణి ఆఫ్రికాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు.
మెరుగుపడిన వాణిజ్యలోటు..
ఇక ఇండియా దిగుమతుల విషయానికి వస్తే గత ఆర్థిక సంవత్సరంలో 898.0 బిలియన్ డాలర్లు నమోదు కాగా.. అంతకు ముందు 2022-23లో 853.8 బిలియన్ డాలర్లు దిగుమతులు జరిగాయి. మొత్తానికి చూస్తే వాణిజ్యలోటు మాత్రం క్రమంగా మెరుగుపడింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 121.6 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటు ఉంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి 75.6 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 మొదటి నెలలో ఎగుమతుల విషయానికి వస్తే 60.40 బిలియన్ డాలర్ల నుంచి 64.56 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. అదే సమయంలో దిగుమల విషయానికి వస్తే 63.02 బిలియన్ డాలర్ల నుంచి 71.07 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక ఏప్రిల్ వాణిజ్య లోటు విషయానికి వస్తే 2.62 బిలియన్ డాలర్ల నుంచి 6.51 బిలియన్ డాలర్లకు పెరిగింది. గత నెల ఏప్రిల్ ఎగుమతుల విషయానికి వస్తే ఎలక్ర్టానిక్ వస్తువులు, ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్ కెమికల్స్, పెట్రోలియం ప్రొడక్టులు, డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్‌అత్యధికంగా ఎగుమతులు జరిగాయని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది.