Indian Stock Market: మార్కెట్లకు ఎగ్జిట్‌ పోల్‌ కిక్కు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఆకాశమే హద్దుగా సోమవారం నాడు దూసుకుపోయాయి. కేంద్రంలో మరోమారు ఎన్‌డీఏ ప్రభుత్వం సునాయాసంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని దాదాపు అన్నీ ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పడంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేశారు.

  • Written By:
  • Publish Date - June 3, 2024 / 07:21 PM IST

 Indian Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఆకాశమే హద్దుగా సోమవారం నాడు దూసుకుపోయాయి. కేంద్రంలో మరోమారు ఎన్‌డీఏ ప్రభుత్వం సునాయాసంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని దాదాపు అన్నీ ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పడంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేశారు. దీంతో సూచి సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. బీఎస్‌ఈ 2,507 పాయింట్లు పెరిగి 76,468.78 వద్ద, నిఫ్టీ 732.20 పాయింట్లు పెరిగి 23,263.90 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ -50 ఆల్‌టైం హై 23,338.70 పాయింట్లకు ఎగబాకింది. బ్యాంక్‌ నిఫ్టీ ఆల్‌టైం హై 51,133.20 వద్ద స్థిరపడింది. ఇక బ్యాంకింగ్‌ రంగానికి చెందిన షేర్ల విషయానికి వస్తే బ్యాంకు ఆఫ్‌ బరోడా, స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా షేర్లు దూసుకుపోయాయి.

దూసుకుపోతున్న షేర్లు..( Indian Stock Market)

ఇక ప్రభుత్వరంగానికి చెందిన పీఎస్‌యు బ్యాంకులు, చమురు, సహజ వాయువు రంగానికి చెందిన షేర్లు లాభాల బాటలో దూసుకుపోయాయి. కాగా పీఎస్‌యు బ్యాంకులు 8.31 శాతం పెరిగితే చమురు సహజ వాయువు షేర్లు 6.82 శాతం పెరిగాయి. అందరూ ఊహించినట్లే ఎగ్జిట్‌పోల్స్‌కు అనుకూలంగానే స్పందించాయి. మార్కెట్‌ నిపుణులు చెప్పారు. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో 43 షేర్లు లాభాలతో ముగియగా.. కేవలం ఏడు షేర్లుమాత్రమే నష్టాలతో క్లోజ్‌ అయ్యాయి. నిఫ్టీ 50లో అత్యధికంగా లాభపడిన షేర్ల విషయానికి వస్తే అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, పవర్‌ గ్రిడ్‌ , ఒఎన్‌జీసీలు లాభపడగా…. దీనికి వ్యతిరేకంగా నష్టపోయిన షేర్ల విషయానికి వస్తే ఐచర్‌ మోటార్స్‌, ఎల్‌టీఐ మైండ్‌ ట్రీ, హెచ్‌సీఎల్‌, సన్‌ ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌ ఉన్నాయి.

కాగా ప్రభుత్వరంగానికి చెందిన షేర్లు ఇన్వెస్టర్లను బాగా ఆకర్షిస్తున్నాయి. దీర్థకాలిక ప్రాతిపదికన ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేస్తున్నారు. స్వల్పకాలానికి మార్కెట్లు ఒడిదుడుకులు కొనసాగుతాయని ఈక్విటి ఇంటెలిజెన్స్‌ వ్యవస్థాపకుడు పొరింజు వెలియత్. ఇక సోమవారం నాటి ట్రేడింగ్‌ విషయానికి వస్తే మార్కెట్‌ ప్రారంభంలోనే 1859.88 పాయింట్ల లాభంతో 75,821.19 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ ఏకంగా 603.85 పాయింట్లు లాభపడి 23,134.55 వద్ద ఒపెన్‌ అయ్యింది. మొత్తానికి చూస్తే ఎగ్జిట్‌పోల్స్‌ ప్రభావం మార్కెట్‌పై కనిపించింది. కేంద్రంలో మరోమారు మోదీ సర్కార్‌ వస్తే సంస్కరణలు యధాతథంగా కొనసాగుతాయని ఇన్వెస్టర్ల ధీమా.