Site icon Prime9

HDFC Bank: రూ. 2 వేల నోట్లపై కస్టమర్లకు క్లారిటీ ఇచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

HDFC Bank

HDFC Bank

HDFC Bank: చలామణి నుంచి రూ. 2000 నోట్లను ఉపసంహరించుకున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రజల వద్ద ఉన్న నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది. ‘క్లీన్ నోట్ పాలసీ’ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నోట్ల మార్పిడి ప్రయత్నాలు మొదలయ్యాయి. మే 23 నుంచి బ్యాంకుల్లో మార్పిడి మొదలు కానుంది.సెప్టెంబర్ 30 వరకు గడువు నిచ్చింది. అయితే రూ. 2 వేల నోటు రద్దు ప్రకటన చేసినప్పటి నుంచి ప్రజలల్లో అనేక సందేహాలు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ తమ కస్టమర్లకు క్లారిటీ ఇచ్చింది.

 

హెచ్‌డీఎఫ్‌సీ క్లారిటీ(HDFC Bank)

ఆర్బీఐ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. కస్టమర్లు తమ వద్ద ఉన్న రూ. 2,000 నోట్లను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన ఏ బ్రాంచ్ లోనైనా మార్చుకోవచ్చని స్పష్టత ఇచ్చింది. నగదును ఖాతాల్లో డిపాజిట్‌ చేసుకునే వెసులు బాటు కూడా ఇస్తున్నట్టు బ్యాంక్ వెల్లడించింది. మే 23, 2023 నుంచి సెప్టెంబరు 30 వరకు ఈ మార్పిడి ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది. కస్టమర్ల సౌకర్యం, విశ్వాసమే తమ మొదటి ప్రాధాన్యమని చెప్పింది. ఈ నేపథ్యంలో కస్టమర్లకు నోట్ల మార్పిడి సమయంలో ఎలాంటి అసౌకర్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించింది.

మరో వైపు రూ. 2 వేల నోటు చెల్లుబాటుపై ఎటువంటి సందేహాలు అవసరం లేదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. ఆర్బీఐ చెప్పే వరకు ఈ నోటును ఎలాంటి లావాదేవీలకైనా ఉపయోగించు కోవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ స్పష్టం చేసింది. ఎంత మొత్తంలో నైనా రూ. 2,000 నోట్లను డిపాజిట్‌ లేదా మార్చుకోవచ్చని తెలిపింది.

 

Exit mobile version