GST collection: ప్రతి నెల జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ఏ నెలకు ఆ నెల వస్తు సేవల పన్ను వసూళ్లలో పెరుగుదల కనిపిస్తోంది. ఫిబ్రవరి నెలలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వసూళ్లు 12 శాతం పెరిగాయి. ఫిబ్రవరి నెలకు గాను రూ. 1.49 లక్షల కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
గత ఫిబ్రవరిలో రూ.1.33 లక్షల కోట్లు వసూలు కాగా.. ఈ ఫిబ్రవరి లో 12 శాతం వృద్ధి నమోదైందని ప్రకటించింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత కేవలం ట్యాక్స్ ల ద్వారానే ఈ నెలలో గరిష్ఠ ఆదాయం వచ్చిందని.. మొత్తంగా ఫిబ్రవరిలో రూ. 11,931 కోట్లు వసూలైనట్లు పేర్కొంది.
సెస్ వసూళ్లలో ఇదే అత్యధికం(GST collection)
ఫిబ్రవరి నెలలో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.1,49,577 కోట్లు కాగా అందులో సీజీఎస్టీ కింద రూ. 27,662 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ. 34,915 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ. 75,069 కోట్లు వచ్చినట్టు ఆర్థిక శాఖ తెలిపింది.
సెస్సుల రూపంలో రూ.11,931 కోట్లు (వస్తువుల దిగుమతి నుంచి వసూలు చేసిన సుంకాలు కలిపి) వసూలైనట్లు పేర్కొంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత సెస్ వసూళ్లలో ఇదే అత్యధిక మొత్తమని వెల్లడించింది.
ఏప్రిల్ 2022దే ఆల్ టైం రికార్డ్
ఏప్రిల్ 2022లో మాత్రం అత్యధికంగా రూ. 1.68 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు కావడం ఆల్‌టైం రికార్డుగా ఉంది. ఆ తర్వాత జనవరి 2023లో రికార్డు స్థాయిలో రూ. 1.57 లక్షల కోట్లు జీఎస్టీ వసూలైంది.
ఇప్పటి వరకు వసూలైన జీఎస్టీలో ఇది రెండో అత్యధికం. ఇక ఫిబ్రవరిలో 28 రోజులు ఉండటం వల్ల మునుపటి నెలలతో పోలిస్తే వసూళ్లు తక్కువ నమోదు అవ్వడం సహజమే అని ఆర్థికశాఖ వెల్లడించింది.