Site icon Prime9

Stock Market: స్టాక్ మార్కెట్లకు జీ20 జోష్.. తొలిసారి 20,000 మార్క్‌ను తాకిన నిఫ్టీ

Stock Market

Stock Market

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ తొలిసారి 20,000 మార్క్‌ను తాకడం విశేషం. దిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడంతో మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. మరోవైపు ఈ సమావేశాల్లో పలు కీలక ఒప్పందాలపై ఏకాభిప్రాయం కుదరడం కూడా మార్కెట్లలో ఉత్సాహం నింపింది. జీవ ఇంధన కూటమి, ‘ఇండియా-మిడిల్‌ ఈస్ట్‌-యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌’ ఏర్పాటుపై ప్రకటన వంటి సానుకూల అంశాలు మార్కెట్లకు కలిసొచ్చాయి. దేశీయంగా వివిధ రంగాల్లో ఉన్న సానుకూలతలు కూడా మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ఫలితంగా వరుసగా ఏడోరోజూ సూచీల్లో లాభాలు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా మన సూచీలు అంతర్జాతీయ సూచీలతో సంబంధం లేకుండానే దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

67 వేల వద్ద సెన్సెక్స్ ..(Stock Market)

ఇక ట్రేడింగ్‌ సరళిని గమనిస్తే.. ఉదయం సెన్సెక్స్‌ 66వేల 807.73 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 67వేల172.13 వద్ద గరిష్ఠాన్ని 66వేల735.84 దగ్గర కనిష్ఠాన్ని తాకాయి. చివరకు 528.17 పాయింట్ల లాభంతో 67వేల127.08 దగ్గర ముగిసింది.. నిఫ్టీ విషయానికి వస్తే 19వేల 890 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 20వేల 008.15 నుంచి 19వేల 865.35 మధ్య ట్రేడైంది. చివరకు 176.40 పాయింట్లు లాభపడి 19వేల 996.35 దగ్గర సరికొత్త రికార్డుతో ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.03 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు మాత్రమే నష్టాల్లో ముగిశాయి. పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, అత్యధికంగా లాభపడిన వాటిలో ఉన్నాయి.

Exit mobile version