stock markets: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు సరి కొత్త రికార్డులను తిరగరాస్తూనే ఉంది. మంగళవారం ట్రేడింగ్‌లోనూ అదే జోరు కొనసాగించింది. విదేశీ మదుపరుల పెట్టుబడుల ప్రవాహం, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లతో సూచీలు మరోసారి లాభాల్లో ముగిశాయి. అమెరికా మార్కెట్లలో సానుకూల వాతావరణం ప్రభావం సైతం మన మార్కెట్లపై కనిపించింది. దీనితో ఓ దశలో 67 వేల మార్కును కూడా సెన్సెక్స్ టచ్ చేసింది.
ఇక ట్రేడింగ్ సరళిని గమనిస్తే సెన్సెక్స్ ఉదయం 66,828 పాయింట్ల వద్ద భారీ లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. ఇంట్రాడేలో 66వేల 574 నుంచి 67వేల007 పాయింట్ల మధ్య కదలాడిన సూచీ.. చివరికి 205.21 పాయింట్ల లాభంతో 66వేల 795.14 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 37.80 పాయింట్ల లాభంతో 19వేల749.25 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.04 వద్ద క్లోజైంది.బీఎస్‌ఈలో ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ముగిశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, సన్‌ఫార్మా, టాటా స్టీల్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.