Tata Motor Altroz: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ సీఎన్‌జీ వెర్షన్‌లో తన ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఆల్ట్రోజ్ ను మార్కెట్లో విడుదల చేసింది. ఆల్ట్రోజ్ సీఎన్జీ పేరుతో రిలీజ్ అయిన ఈ కారు.. మొత్తం 6 వేరియంట్లలో లభిస్తోంది. ఈ కారు ప్రారంభ ధర రూ.7.55 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) కంపెనీ పేర్కొంది. కాగా, హై ఎండ్ వేరియంట్ ధర రూ. 10.55 లక్షలుగా నిర్ణయించినట్టు టాటా మోటార్స్ పేర్కొంది.
అత్యాధునిక ఫీచర్లు(Tata Motor Altroz)
టాటా మోటార్స్ సరికొత్త కారులో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ట్విన్ సిలిండర్ సీఎన్‌జీ టెక్నాలజీతో వస్తున్న ఆల్ట్రోజ్‌లో.. వాయిస్ అసిస్టెంట్‌తో ఓపెన్ అయ్యే ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ లాంటివి ఉన్నాయి. ఇందులో ట్విన్ సీఎన్‌జీ సిలిండర్లు లగేజీకి ఏరియా కింద వైపు అందిస్తున్నారు. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, ఆర్16 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, 8 స్పీకర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లాంటి ఫీచర్లు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. కొత్త ఆల్ట్రోజ్ మూడు రంగుల్లో వస్తోంది. ఓపెరా బ్లూ, డౌన్ టౌన్ రెడ్, ఆర్కేడ్ గ్రే కలర్స్ అందుబాటులో ఉన్నాయి.
కస్టమర్లను ఆకట్టుకునేలా
ప్రత్యామ్నాయ ఇంధనం వైపు వినియోగదారులు ఎక్కువగా చూస్తున్నారని.. ముఖ్యంగా ఆర్థికంగా, పర్యావరణ హితంగా ఉండే వాహనాలను కోరుకుంటున్నారని టాటా మోటార్స్ తెలిపింది. అందుకే విస్తృతంగా లభించే, ఆమోద యోగ్యమైన సీఎన్‌జీ వేరియంట్ ఆల్ట్రోజ్‌ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. సీఎన్‌జీ వాహనాన్ని ఎంపిక చేసుకుని.. కొన్ని ఫీచర్లు, బూట్ స్పేస్ విషయంలో రాజీపడాల్సిన అవసరం లేదని చెప్పింది. అలాంటి అనుమానాలను గత ఏడాది జనవరిలోనే ఐసీఎన్‌జీ టెక్నాలజీ ద్వారా క్లియర్ చేశామని తెలిపింది. తమ ట్విన్ సిలిండర్ టెక్నాలజీ, అత్యాధునిక ఫీచర్లు వ్యక్తిగత వినియోగదారులను ఆకట్టుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేసింది టాటా మోటార్స్.