Hero MotoCorp: ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీ1 ప్రో ధరను భారీగా పెంచింది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ప్రభుత్వం ఇచ్చిన రాయితీని తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హీరో మోటో కార్ప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. రాయితీ తగ్గించడం వల్ల పెరిగిన ధరల భారాన్ని కొంతవరకు మాత్రమే కస్టమర్లపై వేస్తున్నామని తెలిపింది.
ప్రస్తుతం విడా వీ1 ప్రో ధర రూ. 1,45,900 గా ఉంది. ఇందులోనే ఫేమ్ II రాయితీ, పోర్టబుల్ ఛార్జర్ ధర కూడా భాగం. తాజాగా ఈ వెహికల్ ధర రూ. 6,000 పెరిగింది. ధర పెంపును కంపెనీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. ఫేమ్ II సబ్సిడీ కింద గతంలో ప్రభుత్వం విద్యుత్ ద్విచక్ర వాహనాల ఎక్స్ ఫ్యాక్టరీ ధరపై 40 శాతం వరకు రాయితీ ఇచ్చింది. దాన్ని ఇటీవల కేంద్ర భారీ పరిశ్రమల శాఖ 15 శాతానికి తగ్గించింది. దీని వల్ల ఒక్కో యూనిట్‌పై దాదాపు రూ. 32 వేల సబ్సిడీని కస్టమర్లు కోల్పోయారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
తగ్గించిన రాయితీలు జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఇప్పటికే పలు ఈవీ ద్విచక్ర వాహన తయారీ సంస్థలు ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. టీవీఎస్ మోటార్ తమ ఐక్యూబ్ స్కూటర్ ధరను వేరియంట్‌ను బట్టి రూ. 17 వేల నుంచి రూ. 22 వేల వరకు పెంచింది. ఏథర్, ఓలా సైతం తమ స్కూటర్ల ధరలను పెంచాయి. హీరో ఎలక్ట్రిక్ మాత్రం ధరలను పెంచడం లేదని ఇప్పటికే ప్రకటించింది.