Gloster Blackstorm: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియా తమ ఎస్‌యూవీ గ్లోస్టర్‌లో సరికొత్త ఎడిషన్‌ను తీసుకొచ్చింది. బ్లాక్‌స్టోర్మ్ పేరిట తీసుకొస్తున్న ఈ అడ్వాన్స్‌డ్ గ్లోస్టర్‌లో లెవెల్ 1 ‘అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ’అందుబాటులో ఉంది. 2 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తోన్న ఈ కారులో 30 కి పైగా భద్రతా ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర ఎక్స్ షోరూం లో రూ. 40.29 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.
బ్లాక్ స్టోర్మ్ ఫీచర్లివే..(Gloster Blackstorm)
ఈ కొత్త ఎడిషన్ లో ఎన్నో అడ్వాన్స్ డ్ ఫీచర్లను కంపెనీ అందిస్తోంది. డ్యుయల్ పానోరమిక్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 12 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ లాంటి అత్యాధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. స్నో, మడ్, ఎకో, స్పోర్ట్, నార్మల్, రాక్, శాండ్ అనే 7 డ్రైవింగ్ మోడ్‌లు ఈ వేరియంట్ లో అందుబాటులో ఉన్నాయి. 6,7 సీట్ల సామర్థ్యంతో ఈ కారు వస్తోంది. అత్యంత లగ్జరీగా ఇంటీరియర్‌ను తీర్చిదిద్దినట్టు కంపెనీ తెలిపింది.
ఈ కారును కొనుగోలు చేసేవారికి ‘మై ఎంజీ షీల్డ్’ అనే స్పెషల్ ప్రోగ్రాం కింద 180 రకాల సేవలను అందిస్తామని కంపెనీ పేర్కొంది. అలాగే మూడేళ్ల వరకు వారెంటీ, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, మూడు లేబర్ ఫ్రీ పీరియాడిక్ సర్వీసులు కూడా ఇస్తున్నట్లు తెలిపింది.