5G services: దేశ వ్యాప్తంగా 5 జీ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఈ విషయంలో ప్రముఖ టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ విపరీతంగా పోటీపడుతున్నాయి. తమ నెట్ వర్క్ ను విస్తరించేలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రిలయన్స్ జియో ఛార్ ధామ్ ఆలయంలో తన 5 జీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. మరో వైపు భారతీ ఎయిర్ టెల్ దేశ వ్యాప్తంగా 3 వేల నగరాలు, పట్టణాలకు తన 5 జీ ప్లస్ నెట్ వర్క్ ను విస్తరించి సరికొత్త ఫీట్ ను అందుకుంది.
ఛార్ ధామ్ ఆలయాల్లోనూ జియో 5 జీ(5G services)
ఇప్పటికే జియో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో తన 5 జీ నెట్ వర్క్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇపుడు ఆధ్యాత్మిక, టూరిస్ట్ స్థలాలైన ఉత్తరాఖండ్ లోని ఛార్ ధామ్ ఆలయాల్లోనూ 5 జీ సేవలను ప్రారంభించింది. బద్రీనాధ్, కేదార్ నాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయ ప్రాంగణాల్లో జియో ట్రూ 5 జీ సేవలు అందుబాటులోకి తెచ్చింది. దీంతో దేశంలో 3,089 నగరాలు, పట్టణాలకు తమ 5 జీ సేవలను విస్తరించామిన సంస్థ వెల్లడించింది. రానున్న రోజుల్లో మరిన్ని నగరాలకు తమ నెట్ వర్క్ సేవలను తీసుకురానున్నట్టు జియో తెలిపింది. జియో ట్రూ 5 జీ వెల్ కమ్ ఆఫర్లో భాగంగా యూజర్లు ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా 1 GBPS వేగంతో అన్ లిమిటెడ్ టేటాను పొందొచ్చని పేర్కొంది.
3 వేల నగరాల్లో ఎయిర్ టెల్ ప్లస్
మరో వైపు 5జీ సేవల విషయంలో రిలయన్స్ జియో పోటీదారు అయిన ఎయిర్‌టెల్ తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరింప చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 3 వేల నగరాలు, పట్టణాల్లో 5జీ ప్లస్ ( నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు ఎయిర్‌టెల్ వెల్లడించింది. 2023 సెప్టెంబరులోగా ప్రతి ఎయిర్‌టెల్ యూజర్లకు 5జీ సేవలను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. అందులో భాగంగానే రోజుకు 30 నుంచి 40 నగరాలు/పట్టణాలకు తన 5జీ సేవలను విస్తరిస్తున్నట్టు పేర్కొంది.