Prime9

TDP Mahanadu 2025: ఏర్పాట్లు పూర్తి.. రేపటి నుంచే మహానాడు

TDP Mahanadu 2025 in Kadapa:  కడప జిల్లాలో రేపటినుంచి జరిగే మహానాడు సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే టీడీపీ ఫ్లెక్సీలు, కటౌట్లతో కడప నగరం పసుపుమయంగా మారింది. పబ్బాపురంలో 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహించనున్నారు. చారిత్రాత్మక నిర్ణయాలకు కడప మహానాడు వేదిక కానుంది. మొదటి రోజు టీడీపీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపైనే ప్రధాన చర్చించనున్నారు. రెండోరోజు టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, ఆరు సూత్రాల ఆవిష్కరణ, నియమావళిలో సవరణలు చేయనున్నారు.

 

ఏర్పాట్లను మంత్రి వాసంశెట్టి సుభాష్, స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి పరిశీలించారు. తెలుగు తమ్ముళ్లందరికీ మహానాడు పండగ అన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. ఒక విజినరీ ఉన్న నాయకుడిని కోల్పోతే రాష్ట్రం ఎలా ఉంటుందో ప్రజలు ప్రత్యక్షంగా చూశారు కాబట్టే.. భారీ విజయంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారన్నారు. పారిశుద్ధ్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా 3 వందల మంది సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు పట్టాభి. యువతకు, మహిళలకు పెద్ద పీఠ వేయబోతున్నట్టు తెలిపారు.  వేలాది మంది నేతలు, కార్యకర్తలు, అభిమానులు మహానాడులో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా పోలీసులు సభా ప్రాంగణం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

ఉదయం 8.30 కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం ఫొటో ఎగ్జిబిషణ్, రక్తదాన శిబిరాలు ప్రారంభించనున్నారు. 10.45 గంటలకు పార్టీ జాతీయ అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు వేదికపైకి చేరుకుంటారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం మా తెలుగు తల్లికి గీతాలాపనతో మహానాడు లాంఛనంగా ప్రారంభమవుతుంది.

 

ఆ తర్వాత పార్టీ కోసం పనిచేసి మృతిచెందిన కార్యకర్తలు, నేతలకు సంతాపం తెలియజేస్తారు. తర్వాత ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పిస్తారు. 11.30 గంటలకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వాగతోపన్యాసం చేస్తారు. 11.50 గంటలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేస్తారు. అనంతరం టీడీపీ మౌలిక సిద్ధాంతాలపై చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర సాధన, పార్టీ నిర్వహణ తదితర అంశాలపై చర్చిస్తారు.

 

రెండో రోజు బుధవారం ప్రతినిధుల సభతో పాటు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళి అర్పించనున్నారు. అనంతరం పలు తీర్మానాలపై చర్చింనున్నారు. సాయంత్రం 5.30కి పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణ స్వీకారం, అధ్యక్షుడి ప్రసంగం ఉంటాయి. మూడో రోజు మధ్యాహ్నం 2 నుంచి 5గంటల వరకు సుమారు 5 లక్షల మందితో భారీ బహిరంగసభ నిర్వహిస్తారు.

 

 

Exit mobile version
Skip to toolbar