Prime9

Leopard in Tirumala Ghat Road: తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత.. టీటీడీ కీలక సూచన

Leopard in Tirumala Ghat Road: కలియుగ వైకుంఠం తిరుమల. దేవదేవుడు శ్రీవెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటారు. కాగా కొందరు భక్తులు బస్సులు, ట్యాక్సీలు, కార్లలో కొండపైకి వెళ్తుండగా, మరికొందరు కాలిబాటన ఆలయానికి వెళ్తుంటారు.

 

అయితే తిరుమలలో ఇవాళ చిరుత సంచారం కలకలం రేపింది. తిరుమల రెండో ఘాట్ రోడ్డులోని వినాయకుడి గుడి వద్ద రోడ్డు దాటుతూ చిరుత కనిపించిందని.. పలువురు ద్విచక్రవాహనదారులు చెప్పారు. విషయాన్ని టీటీడీ అధికారులకు సమాచారమిచ్చారు.

 

భక్తుల ఫిర్యాదుతో టీటీడీ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అయితే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఘాట్ రోడ్డులో భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా, చిరుత ఆవైపు రాకుండా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. నడకదారిలో వెళ్లే భక్తులు ఒంటరిగా వెళ్లొద్దని.. గుంపుగుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు.

 

కాగా గతంలోనూ పలుమార్లు తిరుమల ఘాట్ రోడ్డు, మెట్లమార్గాల్లో చిరుత కనిపించింది. చిరుత బారిన పడి కొందరు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరికి గాయాలయ్యాయి. అయితే కొంత కాలంగా చిరుత కనిపించకపోవడంతో ప్రశాంతంగా ఉన్న టీటీడీ. చిరుత సంచారంతో మళ్లీ అప్రమత్తమైంది.

Exit mobile version
Skip to toolbar