Home Minister Anita : ఏపీ రాజధాని అమరావతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ఇటీవల వైసీపీ నాయకుల మాటలు ఏపీ గౌరవాన్ని భంగపరచేలా ఉన్నాయన్నారు. అమరావతిని కించపరిచేలా పదాలను ఉపయోగించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతి అంటేనే జగన్‌కు అక్కసు అని వ్యాఖ్యానించారు. మూడు రాజధానులు పేరుతో విషం కక్కారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో అమరావతిని నిర్లక్ష్యం చేశారని ఆమె ఆరోపించారు.
రాజధాని అమరావతి సాధన పోరాటంలో 270 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. అమరావతి పునర్నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, వైసీపీ నేతలు ఎందుకు ఓర్వలేకపోతున్నారు? అని ప్రశ్నించారు. రాజధానిని వేశ్యల అమరావతి అని ప్రోత్సహించిన వారెవరో బయట పెట్టాలన్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన సమావేశంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించేలా మాట్లాడారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడమంటే మహిళలను కించపరచడమా? అని ప్రశ్నించారు. ఏపీ పేరును దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా జగన్, ఆయన భార్య భారతి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యల వెనుక కుట్రదారులపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పత్రిక, ఛానల్‌పై ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కృష్ణం రాజు కుమార్తెపై టీడీపీ సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై స్పందించారు. వ్యాఖ్యలు కూడా తప్పేనని చెప్పారు. పోస్టులను తొలగించమని సూచించినట్లు పేర్కొన్నారు. ఒక వ్యక్తి చేసిన మూర్ఖపు వ్యాఖ్యలను ఖండించాలని, అమరావతి రైతులు, మహిళల మధ్యకు వెళ్లి నిజంగా చెప్పగల ధైర్యం ఎవరికి ఉందో చూడాలంటూ విమర్శల దాడి చేశారు.