Prime9

AP CM Chandrababu : గంజాయి బ్యాచ్‌ ఆగడాలకు అడ్డుకట్టు వేయాలి : ఏపీ సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu review : గంజాయి బ్యాచ్‌ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని తెలిపారు. 100 శాతం మార్పు కనిపించాలని ఆదేశించారు. అనంతపురం పట్టణంలో ఇంటర్‌ విద్యార్థిని హత్య, ఏడుగురాళ్లపల్లిలో బాలికపై అత్యాచారం ఘటనలపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పూర్వాపరాలు పూర్తిగా సీఎం తెలుసుకున్నారు. కేసుల్లో నిందితులకు వెంటనే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. విచారణ పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసి, ట్రయల్స్ పూర్తయ్యేలా చూడాలన్నారు. పక్కాగా ఆధారాలు సేకరించి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని తెలిపారు.

 

పోలీసుశాఖ కఠినంగా వ్యవహరించాలి..
మహిళలపై నేరాల విషయంలో పోలీసుశాఖ కఠినంగా వ్యవహరించాలన్నారు. నేరం చేయాలనే ఆలోచన ఉన్నవారు కూడా భయపడే పరిస్థితి రావాలన్నారు. ఆడబిడ్డలపై క్షణికావేశంలో నేరాలకు పాల్పడే వారికి శిక్ష తప్పదనే అభిప్రాయాన్ని కలిగించాల్సి ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు నేరగాళ్లపై నియంత్రణ లేదని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్, చట్టం అంటే భయం లేకపోవడంతో నేరగాళ్లు అదుపులో లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నేటికీ కొందరు పాత అలవాట్లను మానుకోవడం లేదన్నారు. సీఎం నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

స్పందించిన జాతీయ మహిళా కమిషన్‌..
అనంతపురం జిల్లాలో యువతి హత్యపై జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది. మీడియా కథనాలను సుమోటోగా తీసుకుంది. హత్య ఘటనపై ఏం చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లో నివేదిక పంపాలని డీజీపీకి లేఖ రాసింది.

Exit mobile version
Skip to toolbar