Red Gram Forming: దేశానికి వెన్నుముక రైతన్నలు అని గత కొన్ని దశాబ్దాలుగా వింటూ.. చెప్తూనే ఉన్నాం. ప్రతి రంగంలో అభివృద్ధి అవకాశాలు, లాభాలు ఉంటున్నాయి కానీ యావత్ ప్రపంచానికి ఆహారాన్ని అందించే అన్నదాతలకు మాత్రం ఆ అభివృద్ధి అందని ద్రాక్షలాగే ఉంటుంది. ఒకటి అమరితే మరొకటి ఉండదు. అయితే అతి వృష్టి లేకుంటే అనావృష్టి అన్న చందంగా ఉంటుంది పాపం మన రైతన్నల తీరు. ఇక వర్షం మీదే ఆధారపడి సాగుచేసే రైతన్నపరిస్థితి అయితే మరీ వర్ణనాతీతం అనుకోండి. వర్షం పడుతుంది అనుకుని అన్నీ ఏర్పాటు చేసుకుని విత్తనాలు లేదా నాట్లు వేస్తే.. వాన వస్తే సంతోషం.. ఎక్కువగా పడితే బాధ.. అసలే పడకపోతే దీనాతిదీనం. ఇదీ వారి తీరు.. మరి ఇలాంటి సమయంలో కరువు సమయంలో వేయగలిగే పంట కంది మాత్రమే. కరువు తట్టుకోవడం మాత్రమే కాదు తక్కువ సమయంలో అధిక దిగుబడిని ఇచ్చేందుకు సరికొత్త రకం కంది వంగడాలను ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
40-50 రోజుల్లోనే పంట(Red Gram Forming)..
సాధారణంగా కంది పంట కాలం 180 రోజులు.. అయితే 40-50 రోజుల వ్యవధిలోనే పంట చేతికి వచ్చేలా ఈ సరికొత్త కొత్త రకం వంగడాలను సైంటిస్టులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇవి తక్కువ నీటితో, తెగుళ్లను సైతం సమర్థవంతంగా తట్టుకునేలా వాటిని అభివృద్ధిచేశారు.
ఈ కొత్త రకం వంగడాలను ఐసీఏఆర్- పల్స్ రీసెర్చ్ సెంటర్, కృషి విద్యాపీఠ్, అగ్రికల్చర్ కాలేజీ వంటి సంస్థలతో కలిసి ఇక్రిసాట్ సైంటిస్టులు అభివృద్ధి చేశారు. ప్రస్తుత రకాలతో హెక్టారు విస్తీర్ణంలో 750-850 కిలోల దిగుబడి వస్తున్నది. అయితే, 2050 నాటికి ఈ అభివృద్ధి చేసిన కొత్తరకం వంగడం వల్ల ఏకంగా 1400-1600 కిలోల దిగుబడిని సాధించేలా హైబ్రిడ్స్ ఐసీపీహెచ్ 2433, ఐసీపీహెచ్ 2431, ఐసీపీహెచ్ 2429, ఐసీపీహెచ్ 2438 రకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు.