Woman Wants Divorce: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ తన పెళ్లయిన ఐదు నెలలకే తన భర్త నుంచి విడాకులు కోరింది. దీనికి కారణం అతను హనీమూన్‌కు గోవాకు తీసుకు వెడతానని చెప్పి అయోధ్య,వారణాసికి తీసుకు వెళ్లడమే. ఈ జంట వారి పర్యటన నుండి తిరిగి వచ్చిన 10 రోజుల తర్వాత, జనవరి 19న భోపాల్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలయింది.
ప్రయాణానికి ఒక రోజు ముందు..(Woman Wants Divorce)
తన భర్త ఐటీ రంగంలో పనిచేస్తున్నాడని, మంచి జీతం వస్తుందని విడాకుల పిటిషన్‌లో మహిళ పేర్కొంది. ఆమె కూడా ఉద్యోగరీత్యా, బాగా సంపాదిస్తోంది. హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లడం వారికి పెద్ద విషయం కాదు.ఎలాంటి ఆర్థిక అవరోధాలు లేకపోయినా, ఆ మహిళ భర్త ఆమెను విదేశాలకు తీసుకెళ్లడానికి నిరాకరించాడు. భారతదేశంలోనే ఒక స్థలాన్ని సందర్శించాలని పట్టుబట్టాడు. అతను తన తల్లిదండ్రులను చూసుకోవాల్సి ఉందని చెప్పాడు. దీనితో ఈ జంట తమ హనీమూన్ కోసం గోవా లేదా దక్షిణ భారతదేశాన్ని సందర్శించడానికి అంగీకరించారు. అయితే, ఆ తర్వాత తన భార్యకు చెప్పకుండానే అయోధ్య, వారణాసికి విమానాలు బుక్ చేసాడు. రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి ముందు తన తల్లి నగరాన్ని సందర్శించాలని కోరుకోవడంతో అయోధ్యకు వెళుతున్నామని, ప్రయాణానికి ఒక రోజు ముందు మాత్రమే ఆమెకు తెలియజేశాడు.
ఆ సమయంలో భార్య యాత్రకు అభ్యంతరం చెప్పకపోగా ఎలాంటి వాదనకు తావులేకుండా బయలుదేరింది. అయితే, వారు తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చిన వెంటనే, ఆమె తన భర్త నుండి విడాకులు కోరుతూ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన భర్త తన కంటే తన కుటుంబ సభ్యులను ఎక్కువగా చూసుకునేవాడని ఆమె తన ప్రకటనలో పేర్కొంది.ప్రస్తుతం ఈ జంటకు భోపాల్ ఫ్యామిలీ కోర్టులో కౌన్సెలింగ్ జరుగుతోంది.