Lakshadweep: కేరళ తీరానికి సుమారు 250 మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ మంచి పర్యాటక ప్రదేశం .ఇక్కడి వాతావరణం అక్టోబరు నుంచి ఏప్రిల్ మధ్య ఆహ్లాదంగా ఉంటుంది. సహజసిద్దమైన బీచ్ లు, వాటర్ స్పోర్ట్స్ , సమద్రపు వంటకాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
లక్షద్వీప్ లో పర్యాటకులకు వాటర్‌స్పోర్ట్ మంచి అనుభూతినిస్తాయి. పారాసైలింగ్, కానోయింగ్, జెట్ స్కీయింగ్, స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్, రీఫ్ వాకింగ్ లను పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడతారు. లక్ష ద్వీప్ రాజధాని నగరం కవరత్తిలో ఉన్న మెరైన్ మ్యూజియంలో సముద్ర కళాఖండాలు ఉన్నాయి. ఇది 1983లో స్థాపించబడింది మరియు వివిధ సకశేరుకాలు మరియు వృక్ష జాతులు ప్రదర్శనలో ఉన్నాయి. లక్షద్వీప్‌లోని సహజమైన తెల్లని బీచ్‌లలో కుర్చీల మీద కూర్చొని సేదతీరడాన్ని పర్యాటకులు అస్వాదిస్తారు. లక్షద్వీప్‌లోని బీచ్‌లు చాలా సహజంగా తాటి చెట్లతో నిండి ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ బీచ్‌లలో చాలా వినోదభరితమైన కార్యకలాపాలు ఉన్నాయి. అరేబియా సముద్రంలో క్రూయిజ్ ప్రయాణం మంచి అనుభవం. ఈ క్రూయిజ్ ప్రయాణాలు మంచి ప్రశాంతతను, గొప్ప అనుభవాన్ని అందిస్తాయి.
ఈ ప్రదేశం కేరళకు దగ్గరగా ఉండడంతో ఆ ప్రభావం ఆహారం మీద కూడా ఉంటుంది. కొబ్బరి వాడకం ఎక్కువ. వంటల్లో సుగంధద్రవ్యాల వినియోగమూ ఎక్కువే. రెస్టారెంట్లలో ప్రధానమైన మెనూలో సీఫుడ్ రకాలు ఎక్కువగా కనిపిస్తాయి. శాకాహారం కూడా దొరుకుతుంది. ఈ ద్వీపంలోని ప్రజలు వివిధ రకాల చేపలను వేయించిమరియు కాల్చి తినడానికి ఇష్టపడతారు.
ఎలా వెళ్లాలి?
లక్షద్వీప్ కు దగ్గరగా ఉన్న తీరం కేరళలోని కొచ్చి నగరం. కొచ్చి నుంచి అగట్టి దీవికి ఇండియన్ ఎయిర్లైన్స్ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అగట్టి ద్వీపంలో దిగిన తర్వాత ఇతర దీవులకు వెళ్లడానికి హెలికాప్టర్, ఫెర్రీ, షిప్, సౌకర్యం ఉంటుంది. కొచ్చి వరకు రైల్లో వెళ్లి అక్కడి నుంచి విమానం లేదా షిప్ లో లక్షద్వీప్ చేరాల్సి ఉంటుంది.లక్షద్వీప్ పర్యాటక శాఖ కొచ్చి నుంచి అగట్టి దీవికి షిప్ క్రూయిజ్ నడుపుతోంది. ‘ఎం.వి. టిప్పు సుల్తాన్, ఎం.వి. భరత్సీమ, ఎం.వి. ఆమినిదీవి, ఎం.వి. మినికోయ్’ అనే నాలుగు క్రూయిజ్ లు వున్నాయి. వీటిలో ప్రయాణానికి లక్షద్వీప్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ముందుగా బుక్ చేసుకోవచ్చు.
వసతి సౌకర్యం?
సీషెల్స్ బీచ్ రిసార్టు, ఐలాండ్ హాలిడే హోమ్, లక్షద్వీప్ హోమ్స్టే, కోరల్ ప్యారడైజ్, కాడ్మట్ బీచ్ రిసార్టు వంటివి చాలా ఉన్నాయి. ఒక రోజుకు ఐదు వందల రూపాయలు వసూలు చేసే గెస్ట్ హౌస్ల నుంచి వేలరూపాయలు వసూలు చేసే రిసార్టుల వరకు ఉన్నాయి.