Maldieves: మాల్దీవులు, భారతదేశానికి ఆనుకుని ఉన్న హిందూ మహా సముద్రంలో నైరుతిన శ్రీలంక కింది భాగంలో ఉన్న చిన్న దీవి. దాని విస్తీర్ణం చాలా తక్కువ. జనాభా కూడా 5 లక్షలకు మించదు. కానీ పర్యాటకులకు కొత్త అయింది. ముఖ్యంగా బాలీవుడ్ నటీనటులకు అదో స్వర్గంలా మారింది. అంతకుముందు వీరంతా సేదతీరడానికి ఏ ప్యారిస్ కో, స్పెయిన్ కో వెళ్లేవాళ్లు. కాల క్రమేణా దాని స్థానంలో థాయ్లాండ్, బ్యాంకాక్ వచ్చి చేరాయి. ఇక కరోనా నేపథ్యంలో దూర ప్రయాణాలు చేయడానికి నటీమణులు ఆసక్తి చూపడం లేదు. అలాగని వారు విహార యాత్రలను వదులుకోవడం లేదు.
కరోనా కారణంగా షూటింగ్ లు ఇంకా పూర్తి స్థాయిలో మొదలవ్వలేదు. దీంతో చాలా మంది సేద తీరడానికి మాల్దీవులనే ఎంచుకుంటున్నారు. టాలీవుడ్ నుంచి మొదలుకుని, కోలివుడ్, మల్లూవుడ్, సాండల్ వుడ్, బాలీవుడ్ నటీమణులంతా అక్కడ వాలిపోతున్నారు. అక్కడ స్వచ్ఛమైన బీచ్ లలో తిరగాడుతూ, ఎంజాయ్ చేస్తున్నారు. కత్రినా కైఫ్, టైగర్ ష్రాఫ్, వరుణ్‌ధావన్, తాప్సీ పన్ను, దిశా పటాని, రకుల్ ప్రీత్ సింగ్, సోనాక్షి సిన్హా. ఇలా ఎంతో మంది మాల్దీవుల బాటపట్టారు. చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలూ మాల్దీవులను సందర్శించారు. సినిమాతారలే కాదు పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, రాజకీయనాయకులు అందరూ మాల్దీవుల బాట పడుతున్నారు.
మాల్దీవుల అందాన్ని ఆస్వాదించాలంటే డిసెంబర్ నుంచి ఏప్రిల్ మధ్యలో వెళ్లడం సరియైున ప్రణాళిక. ఆ సమయంలో అక్కడ 29డిగ్రీల నుంచి 31డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ వాతావరణం చలిగాను ఉండదు, వేడిగాను ఉండదు. ప్రతి దీవిలో రిసార్టులు, వాటర్ గేమ్స్, స్పా, బీచ్, రెస్టారెంట్ ఉంటాయి. రిసార్టును బట్టి ఖర్చు ఆధారపడి ఉంటుంది. రిసార్టులను నీళ్ల మధ్యలో కట్టారు. వాటిని చేరుకోవడానికి ‘సీ ప్లేన్’లను వాడతారు. ఇవి హెలికాప్టర్‌లాంటివే. కాకపోతే నీటిమీద కూడా నడవగలవు.
మాల్దీవుల రాజధాని మాలెకు విమానంలో చేరుకున్నాక సీ ప్లేన్, వాటర్ బోట్లలో ఎంచుకున్న రిసార్టులకు చేరుస్తారు. కొన్ని రిసార్టులలో మూడు రోజుల ప్యాకేజ్ విలువ రూ.2.78 లక్షలు. అదే అయిదు రోజులు ఉండాలనుకుంటే రూ.3.40 లక్షలు చెల్లించాలి. విమాన ప్రయాణ ఖర్చులు అదనం. కొన్ని ప్రైవేటు పర్యాటకసంస్థలు ఒక వ్యక్తికి రూ.30 వేల నుంచి రూ.50 వేల ప్యాకేజీల మధ్య ఆఫర్లు ఇస్తున్నాయి.