Lagacharla Lands: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. లగచర్లలో భూసేకరణ రద్దు

Land Acquisition Canceled In Lagacharla: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్లలో భూసేకరణ నిలిపివేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ నిలిపివేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఫార్మా కంపెనీల కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వికారాబాద్ జిల్లా లగచర్చ ప్రాంతంలో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేసేందుకు గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ భూసేకరణకు సంబంధించి అభిప్రాయ సేకరణకు ఇటీవల లగచర్ల ప్రాంతానికి వెళ్లిన కలెక్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది.

అయితే, ఇది ఫార్మా సిటీ కంపెనీ కాదని సీఎం రేవంత్ రెడ్డి సైతం వివరించారు. కానీ అక్కడి ప్రజలు ఫార్మా సిటీ వద్దని వారించడంతో పాటు ఇతర పరిణామాలు చోటుచేసుకోవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఫార్మా కంపెనీల ఏర్పాటుకు సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లా దుద్యాల మండంలోని లగచర్లలో తలపెట్టారు. అయితే ఈ కంపెనీ వ్యవహారంపై జరిగిన పరిణామాల అనంతరం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. కలెక్టర్‌ను పిలిపించి దాడికి యత్నించారు.

అయితే ఇందులో బీఆర్ఎస్ కార్యకర్తలు కావాలనే చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఉన్నారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, భూ సేకరణ నోటిఫికేషన్‌ను ఆగస్టు 1న తెలంగాణ సర్కార్ జారీ చేసింది.