Suryakumar Yadav: టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్.. క్రీజులోకి వచ్చాడంటే బౌలర్లకు దడ పుట్టాల్సిందే.. ఎలాంటి బంతి అయినా గ్రౌండ్ లో నలు దిక్కూలా పంపగలడు. ఇది టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ రికార్డు.. కానీ వన్డేలకు వచ్చేసరికి అతని ఆటతీరు పూర్తిగా తేలిపోతోంది. ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా మూడు మ్యాచుల్లో సూర్యకుమార్ విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఇప్పటివరకు 21 వన్డేలు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 24.05 సగటుతో 433 పరుగులు చేశాడు. 2021, జులై లో శ్రీలంకతో జరిగిన సిరీస్ లో వన్డేల్లో అడుగుపెట్టాడు సూర్య. మొదట్లో మెరుగ్గానే రాణించి.. తొలి 6 ఇన్నింగ్స్ లో వరుసగా 31( నాటౌట్), 53,40,39, 34 (నాటౌట్), 64 పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాత సూర్య ఆట గాడి తప్పిందనే చెప్పుకోవచ్చు.
ఆటతీరు ఇలాగే కొనసాగితే.. (Suryakumar Yadav)
టీ20ల్లో వీర విహారం చేస్తున్న సూర్య.. వన్డేల్లో మాత్రం కనీసం క్రీజులో నిలతొక్కులేకప ఇబ్బంది పడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అయితే సూర్య ఇన్నింగ్స్ మరీ దారుణం. జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మొదటి రెండు వన్డేల్లో స్టార్క్ బౌలింగ్‌లో ఒకే విధంగా వికెట్ల ముందు దొరికిపోయాడు సూర్య. మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్ అగర్ బంతిని అంచనా వేయలేక మళ్లీ బౌల్డయ్యాడు.
ఈ మ్యాచ్‌లో సూర్య ఏడో స్థానంలో ఆడించినా ఫలితం లేకుండా పోయింది. ఛేదన కష్టంగా మారి.. టీ 20 లాంటి పరిస్థితులు ఉన్న సమయంలోనూ సూర్య ఆడలేకపోవడం నిరాశ కలిగించే అంశం. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా జట్టులో సూర్యకు చోటు దక్కుతోంది. సూర్య ఆటతీరు తెలుసని.. అతడికి తమ ప్రోత్పాహం ఉంటుందని కెప్టెన్ రోహిత్ చెబుతున్నాడు. అయితే గాయం నుంచి కోలుకుని శ్రేయస్ వస్తే సూర్య తుది జట్టుకు దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. సూర్య ఆటతీరు ఇలాగే కొనసాగితే.. వన్డే ప్రపంచకప్‌లో సూర్య ఆడటంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
గోల్డోన్ డకౌట్ తో దిగ్గజాల సరసన
కాగా, ఆస్ట్రేలియా సిరీస్ లో భాగంగా జరిగిన మూడో వన్డేలో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన సూర్య అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఓ వన్డే సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల్లో గోల్డెన్ డక్ అయిన మొదటి ఇండియన్ బ్యాటర్‌గా నిలిచాడు. మొత్తంగా వన్డేల్లో వరుసగా మూడుసార్లు డకౌట్ అయిన ఆరో భారత ఆటగాడిగా రికార్డుకెక్కాడు. సూర్యకుమార్ కంటే ముందు సచిన్, అనిల్ కుంబ్లే, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరారు.
వన్డేల్లో అత్యధికసార్లు డక్ అయిన రికార్డు శ్రీలంక మాజీ క్రికెటర్ లసిత్ మలింగ పేరుతో ఉంది. మలింగ వరుసగా నాలుగుసార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత గుస్ లోగీ (వెస్టిండీస్), ప్రమోద్య విక్రమసింఘే (శ్రీలంక), హెన్రీ ఒలోంగా (జింబాబ్వే), క్రెయిగ్ వైట్ (ఇంగ్లాండ్) కూడా వన్డేల్లో ఖాతా తెరవకుండా క్రీజును వీడారు.
రెండో స్థానానికి భారత్
ఇక భారత్‌తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో కంగారూలు మూడు వన్డేల సిరీస్‌ని 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 2019 ఏప్రిల్ తర్వాత భారత్‌కి స్వదేశంలో తొలి వన్డే సిరీస్ ఓటమి ఇదే.
మూడో వన్డేలో ఓటమితో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. భారత్‌ని ఓడించిన ఆస్ట్రేలియా టాప్ లోకి దూసుకెళ్లింది. ఆసీస్ 113.286 రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. భారత్ 112.638 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.