Sara Tendulkar joins Sachin Tendulkar Foundation as director: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సమాజ సేవ దిశగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఇటీవలే సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ (ఎస్‌టీఎఫ్) డైరెక్టర్‌గా నియమితులైన సారా.. తమ ట్రస్ట్ తరపున మారుమూల పల్లెల్లోని పేద పిల్లలకు మెరుగైన వైద్యం అందించే ప్రాజెక్టు కోసం ఇకపై మరింత సమయం కేటాయించనున్నారు.
ఈ విషయాన్ని సచిన్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ‘మా అమ్మాయి సారా ఎస్‌టీఎఫ్ డైరెక్టర్‌గా రావటం నాకెంతో సంతోషంగా ఉంది. ఆమెకు వైద్యరంగంపై ఉన్న పరిజ్ఞానం.. చాలామంది గ్రామీణ ప్రాంత చిన్నారులకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించనుంది’ అని తన పోస్ట్‌లో సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారులతో కలిసి సారా దిగిన ఫొటోలను సచిన్ అందులో జత చేశారు. సారా.. లండన్‌లోని యూనివర్సిటీ నుంచి క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందిన సంగతి తెలిసిందే.