Ravichandran Ashwin: మూడో టెస్ట్ డ్రా.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భారత్ ఆటగాడు

Ravichandran Ashwin Announces International Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు భారత్ ఆటగాడు, స్పిన్నర్, ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ గుడ్ బై చెప్పేశాడు. ఈ మేరకు ఆయన రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గబ్బాలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా అంపైర్లు డ్రాగా ప్రకటించారు. ఈ మ్యాచ్ ముగిసిన కాసేపటికే రిటైర్ మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు.

అంతకుముందు బోర్డర్ గవాస్కర్ సిరీస్ తర్వాత భారత్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే మూడో టెస్ట్  రెండో ఇన్నింగ్స్ జరుగుతుండగా.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎమోషనల్ అవుతున్న అశ్విన్‌ను విరాట్ కోహ్లీ హత్తుకొని ఓదార్చారు. ఈ నేపథ్యంలోనే బోర్డర్ గవాస్కర్ తర్వాత టెస్టులకు అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటిస్తారని, ఇదే తన చివరి టెస్ట్ సిరీస్ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా, మూడో టెస్ట్ తర్వాతనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ పేర్కొంటూ ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఆయనను భారత జట్టులో అమూల్యమైన ఆల్ రౌండర్‌గా పేర్కొంది. అన్ని ఫార్మాట్లలో కలిసి అశ్విన్ 765 వికెట్లు తీసి లెజెండరీ బౌలర్ల సరసన చేరారు.

ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా విధించిన గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ డ్రా అయింది. 5వ రోజు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. అనంతరం 275 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 8 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం తీవ్రత పెరగడం తో పాటు బ్యాడ్ లైట్ కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. దీంతో 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-1తో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి.