Rajat Patidar for RCB New Captain: ఆర్సీబీ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త కెప్టెన్ పేరును ప్రకటించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025కు సంబంధించి యువ బ్యాటర్ రజత్ పాటిదార్‌కు ఆర్సీబీ జట్టు కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
అయితే, ఆర్సీబీ జట్టులో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సభ్యుడిగా ఉన్నప్పటికీ.. మొదటి నుంచి కెప్టెన్సీ వైపు విరాట్ ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో ఆయన నిర్ణయం మేరకు ఆర్సీబీ మరొకరి కోసం ప్రయత్నించింది. ఇందులో భాగంగానే డుప్లెసిస్ పేరు ప్రస్తావన వచ్చింది. అయితే గత సీజన్‌లో ఆర్సీబీ జట్టును నడిపించిన డుప్లెసిస్‌ను ఈ ఏడాది రిటైన్ చేసుకోలేదు. దీంతో పేసర్ భువనేశ్వర్‌తో పాటు కృనాల పాండ్య రేసులో ఉన్నారు.
ఈ సీజన్ మొదటి నుంచి వస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ ఆర్సీబీ ఫ్రాంచైజీ యువ బ్యాట్స్ మన్ రజత్ పాటిదార్ పేరును ప్రస్తావించింది. రజత్ పాటిదార్.. 2021 నుంచి ఆర్సీబీ జట్టులో కొనసాగుతున్నాడు. నవంబర్‌లో జరిగిన మెగా వేలంలో ఆర్సీబీ ముగ్గురు కీలక ఆటగాళ్లను అంటిపెట్టుకోగా.. అందులో రజత్ పాటిదార్ కూడా ఉన్నారు.
ఈ 31 ఏళ్ల రజత్ పాటిదార్.. 2024-25 సీజన్‌లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోపీ, విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్ స్టేట్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. పాటిదార్.. 2023లో వన్డేల్లోకి ఎంట్రీ ఇవ్వగా.. గతేడాది భారత్ తరఫున టెస్టు మ్యాచ్‌ల్లో అరంగేట్రం చేశాడు. మొత్తం మూడు టెస్టులు, ఒక్క వన్డే మ్యాచ్ మాత్రమే ఆడిన అనుభవం ఉంది. ఇక, ఐపీఎల్ విషయానికొస్తే.. 2021లో ఐపీఎల్‌లో కి ఎంట్రీ ఇచ్చిన పాటిదార్ ఇప్పటివరకు 27 మ్యాచ్‌లు ఆడగా.. 34.74 సగటుతో 799 పరుగులు చేశాడు.