Rafael Nadal: టెన్నిస్‌కు గుడ్ బై చెప్పిన ‘కింగ్ ఆఫ్ క్లే’..డేవిస్ కప్.. చివరి సిరీస్ అంటూ ప్రకటన

Rafael Nadal announces retirement from tennis: స్పెయిన్ దిగ్గజ ఆటగాడు, కింగ్ ఆఫ్ క్లే రఫెల్ నాదల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు, ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్స్ చివరి సిరీస్ అని ప్రకటించాడు.

1986 జూన్ 3న స్పెయిన్‌లో జన్మించిన రఫెల్ నాదల్.. 2001లో అంతర్జాతీయ టెన్నిస్‌లోకి ప్రవేశం పొందాడు. ఆ తర్వాత 2008లో నంబర్ వన్ ర్యాంక్ సాధించగా.. దాదాపు ఐదేళ్లు వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్‌గా కొనసాగారు.

‘క్లే కోర్టు’ రారాజుగా పిలువబడే 38 ఏళ్ల రఫెల్.. 22 సార్లు గ్రాండ్ స్లామ్, 14 ఫ్రెంచ్ ఓపెన్, 4 యూఎస్ ఓపెన్, 2 వింబుల్డన్ టైటిళ్లు నెగ్గాడు. అలాగే ఫెడరర్‌పై 40, జకోవిచ్‌పై 60 మ్యాచ్‌లు గెలుపొందారు. దీంతోపాటు సింగిల్స్‌లో కెరీర్ గోల్డెన్ స్లామ్ పూర్తి చేసిన ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లలో నాదల్ ఒకడిగా గుర్తింపు పొందాడు.

క్లే కోర్టుపై ఏకంగా 81 వరుస విజయాలు పొందిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. గత రెండేళ్లు గాయాల కారణం కఠినంగా గడిచాయని, రిటైర్మెంట్ నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పట్టిందని వెల్లడించాడు.