Pakistan Cricket Board Suffers Rs 869 Crore Loss In Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ మెగా టోర్నీ నిర్వహించడంతో అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది. ఎన్నో అవాంతరాలు, అనుమానాలు, అహకారంతో టోర్నీని నిర్వహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు దాదాపు రూ.869కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునేందుకు పాకిస్తాన్ బోర్డు తీవ్ర ఇబ్బందులు పడుతోంది.
అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో వచ్చిన నష్టాన్ని భరించేందుకు తమ క్రీడాకారులతో పాటు ఇతర క్రీడాకారులపై ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మ్యాచ్ ఫీజులు తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దాదాపు 29 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ టోర్నీ నిర్వహించేందుకు హక్కులు దక్కించుకుంది. దీంతో ఆ దేశంలోని మైదానాలను డెవలప్ చేసింది.
రావల్పిండి, లాహోర్, కరాచీ మైదానాల కోసం 58 మిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. ఇందులో ఈవెంట్ కోసం 40 మిలియన్ డాలర్లు ఖర్చు చేయగా.. మొత్తం 98 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అయితే హోస్టింగ్ ఫీజు కింద పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు 6 మిలియన్ డాలర్లు వచ్చినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. అలాగే టికెట్ విక్రయాలు, స్పాన్సర్ తదితర దాంట్లో అనుకునంతగా రాకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తీవ్ర నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. అందుకే పాకిస్తాన్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 50 శాతానికి పైగా కోత విధించడంతో పాటు లగ్జరీ హోటల్ లో ఉండడం వంటి వాటిపై నిషేధించినట్లు సమాచారం.