India Won The match agianst australia in champions trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా తొలి సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(39), కెప్టెన్ స్మిత్(73), అలెక్స్ కేరీ(61) పరుగులతో అదరగొట్టగా.. లబుషేన్(29), డ్వార్షుయిస్(19), జోష్ ఇంగ్లిష్(11), నాథన్(10), మ్యాక్స్ వెల్(7) పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు.
ఆస్ట్రేలియా విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని భారత్ 48.1 ఓవర్లలోనే ఛేదించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ (28), శుభ్ మన్ గిల్(8), శ్రేయస్ అయ్యర్(45), విరాట్ కోహ్లీ(84), కేఎల్ రాహుల్(42), హార్దిక్ పాండ్యా(28), పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 2 వికెట్లు పడగొట్టగా.. బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కూపర్ కనోలి తలో వికెట్ తీశారు. చివరిలో 12 బంతుల్లో 4 పరుగులు అవసరం ఉండగా.. రాహుల్ సిక్స్‌తో విజయం అందించాడు. సెమీస్‌లో భారత్ విజయం సాధించడంతో ఫైనల్ చేరింది. కాగా, అంతకుముందు ప్రపంచ కప్ 2023లో ఫైనల్‌లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియాపై భారత ఆటగాళ్లు ప్రతీకారం తీర్చుకున్నారు.