India vs South Africa: నేడు భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20.. భారత్ జట్టులో మార్పులు!

India vs South Africa second t20 match: ఒకవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో కూడిన సీనియర్ జట్టు అటు వన్డే, ఇటు టెస్టు మ్యాచ్ ల్లో వరుసపెట్టి ఓడిపోతోంది. అయితే టీ 20ల్లో మాత్రం సూర్యకుమార్ కెప్టెన్సీలో దుమ్ము దుమారం రేపుతోంది. తాజాగా, దక్షిణాఫ్రికా తో జరిగే నాలుగు టీ 20ల్లో భాగంగా తొలి మ్యాచ్ లో భారత్ విజయపతాకం ఎగురవేసింది. ఇక ఆదివారం సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరగనున్న రెండో టీ 20లో భారత జట్టులో ఒక మార్పుతో బరిలో దిగనుందని సమాచారం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ స్ఫూర్తిమంతంగా ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. కొత్తవారందరికి అవకాశాలు ఇవ్వాలని అనుకుంటాడు. అయితే తొలి టీ 20లో అక్షర్ పటేల్ కి కేవలం ఒక ఓవర్ మాత్రమే వచ్చింది. అలాగే బ్యాటింగ్ చివరిలో వచ్చి 7 పరుగులు మాత్రమే చేశాడు. నిజానికి అక్కడ పిచ్ లపై వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ ప్రభావం చూపించడంతో అక్షర్ అవసరం పెద్దగా కనిపించడం లేదు. అందుకే యువ పేసర్ కమ్ ఆల్ రౌండర్ రమణ్ దీప్ సింగ్ కి తొలి అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది.

మరో కొత్త ఆటగాడు

భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో మరో కొత్త ఆటగాడు అడుగుపెట్టనున్నాడు. అయితే కోల్ కతా నైట్ రైడర్స్ రిటైన్ చేసుకున్న ఐదుగురు ఆటగాళ్లలో తను కూడా ఒకడిగా ఉన్నాడు. హార్డ్ హిట్టర్ గా పేరున్న రమణదీప్ సింగ్ రావాలని అభిమానులు కూడా కోరుతున్నారు. దక్షిణాఫ్రికాతో టీమ్ ఇండియా ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు ఆడింది. అందులో టీమిండియా 16 మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే, కివీస్ 11 మ్యాచ్ ల్లో గెలిచింది. అయితే సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో మాత్రం దక్షిణాఫ్రికా గెలవడం విశేషం.

రెండో టీ 20కి భారత తుది జట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, రమన్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్.